Greenery in Singareni Coal mines area : బొగ్గు ఉత్పత్తి అంటే ఎన్నో వ్యయప్రయాసలతో కూడిన ప్రక్రియ. ఎందుకంటే వాటి నిర్వహణలో అనేక విభాగాలు ఉండటం వల్ల దాని నుంచి దుమ్ముధూళి కణాలు వెలువడుతుంటాయి. బొగ్గులో కార్బన్‌తో పాటు సల్ఫర్, నైట్రోజన్, ఆర్గానోమెటాలిక్ సమ్మేళనాలతో సహా అనేక పదార్థాలూ ఉన్నాయి. ఇవి వాతావరణంలో మిళితమై ఆ గాలిని మనం పీలుస్తే ప్రజలకు శ్వాసకోశ సమస్యలతో పాటు పలుఅనారోగ్య సమస్యలువచ్చే అవకాశం ఉందని.. అలాంటి వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పలు చర్యలకు ఉపక్రమించారు. ప్రధానంగా నల్లబంగారం ఉత్పత్తి చేసే సింగరేణి మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల పల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో మొత్తం 22 భూగర్భగనులు, 19 ఉపరితల గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. దీంతో ఎలాగైనా వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలని భావించిన సంస్థ అందుకు సంబంధించిన చర్యలపై దృష్టి సారించింది.
"ఆర్జీ-3లో సుమారుగా 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయటం జరుగుతోంది. ఓసీ1, ఓసీ2 నుంచి వీటి కోసం ప్రత్యేకంగా ఓబీ డమ్స్ మీద మొక్కలు పెంచటం, బారియర్స్‌ను నిర్మించటం, మిస్ట్ స్ప్రే చేయటం లాంటివి చేసి పరిసర ప్రజలకు ధ్వని, పొగ కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్నాం. ఇవన్నీ కూడా వాతావరణ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు చేస్తున్నాం. చుట్టు పక్కల ఉన్న ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం." - వెంకటేశ్వర్‌రావు, జనరల్ మేనేజర్, ఆర్జీ-3 రామగుండం, పెద్దపల్లిజిల్లా
సత్ఫలితాలిస్తే మరో చోట :గనుల నుంచి వెలువడే బొగ్గును ఒక చోటుకు చేర్చి వ్యాగన్లు, సైలో బంకర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే చోటునే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటుగా పిలుస్తుంటారు. ప్రస్తుతం సీహెచ్‌పీల నుంచి దుమ్ము ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నీటిని చల్లించడం, చుట్టూ పచ్చటి కవర్లను కట్టడం వంటి పనులు చేస్తున్నారు. ఐతే, ఈ చర్యలతో సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం కావడం లేదు. అందుకే సింగరేణిలోనే మొదటిసారిగా రామగుండం-3 డివిజన్‌లోని ఓసీపీ-1 సీహెచ్‌పీలో పర్యావణ హితంగా మూడు దశల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తే మిగతా సీహెచ్‌పీల్లో అమలు చేయాలని యాజమాన్యం భావిస్తోంది.
పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు :లక్ష్యానికి మించి బొగ్గును ఉత్పత్తి చేయడం వల్లదెబ్బతిన్న పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు ఓసీపీ-1తో పాటు పరిసర గ్రామాల్లో మొక్కలు నాటాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సింగరేణికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో 3.60 కోట్ల రూపాయలతో ఓసీపీ-1 సీహెచ్‌పీతో పాటు పరిసర జూలపల్లి, ముల్కలపల్లి, పన్నూరు, రత్నాపూర్, నాగేపల్లి గ్రామాల్లో మొక్కలు నాటడం, ఇంకుడుగుంతలు, చెక్‌డ్యాంలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.