Gangula Kamalakar press meet: దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా నగునూరు, చామనపల్లి, చర్లబుత్కూర్, దుర్శేడ్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎల్ఎమ్డీ జలాశయంలోని గంగమ్మ దేవాలయం వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో 3 లక్షల రొయ్య పిల్లలు వదిలారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా.. నిబంధనలకు అనుగుణంగా కేంద్రానికి బియ్యం ఇవ్వాల్సి ఉంటుందని.. అందువల్ల తేమ, తాలు అంశాల్లో రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 2014కు ముందు కేవలం 14లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే నేడు కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంటకు అవసరమైన నీరు, కరెంటు, ఎరువులు సకాలంలో అందించడమే కాకుండా కొనుగోలుకు అన్ని చర్యలు తీసుకున్నదృష్ట్యా రైతులు వరి పండించడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 6వేల 713 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించామని, ఇప్పటివరకు 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల్ని 6313 మంది రైతుల నుంచి 100 కోట్ల రూపాయల విలువగల ధాన్యం ప్రభుత్వం సేకరించిందని అన్నారు. నిధుల కొరత లేదని, గన్నీలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లతో పాటు అన్నీ అందుబాటులో ఉన్నాయని వాటి వినియోగించుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు.