తెలంగాణ

telangana

ETV Bharat / state

TEACHING IN TAMIL COLONY: ఆ ఊళ్లో గోడలే బ్లాక్​ బోర్డులు.. వీధులే పాఠశాలలు.! - teaching process in tamil colony

ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నట్లే.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాకపోతే పరిష్కారం కనుగొనాలన్న ఆసక్తి ఉండాలి. కొవిడ్​ వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలు ఆన్‌లైన్ పాఠాలు వినే పరిస్థితి లేదు. ఇలాగే పిల్లలను వదిలేస్తే ఇప్పటికి వరకు నేర్చుకున్న చదువు కూడా మరిచిపోయే ఆస్కారం ఉంది. అందుకే దీనికి పరిష్కారంగా ఒక ఉపాధ్యాయురాలు పాఠాలనే వీధుల్లోకి తీసుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీధివీధికి పాఠశాలను తీసుకొచ్చారు. పాఠశాలలు ప్రారంభమైనప్పుడే పాఠాలు చెబుదామని ఆ ఉపాధ్యాయురాలు చేతులు ముడుచుకోలేదు. ఒక యజ్ఞంలా చేసిన ఈ యత్నంతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు.

TEACHING IN TAMIL COLONY
తమిళ కాలనీ

By

Published : Aug 29, 2021, 12:37 PM IST

Updated : Aug 29, 2021, 3:43 PM IST

కరీంనగర్ జిల్లా బావుపేట.. గ్రానైట్‌ క్వారీలకు అడ్డా. ఇక్కడికి ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. పనుల కోసం తల్లిదండ్రులు క్వారీకి వెళ్తుంటే కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి చిన్నారులు వీధుల కెక్కారు. దాదాపు రెండేళ్లుగా పాఠశాలలు తెరవక పోవడం.. ప్రభుత్వం ఆన్‌లైన్‌ క్లాసులకు శ్రీకారం చుట్టినా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న.. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లు కొనివ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైనా ఆ విద్యార్థులు మాత్రం చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఆ చిన్నారుల చదువును పర్యవేక్షించే తమిళకాలనీకి చెందిన ఉపాధ్యాయురాలు గాజుల ప్రేమలత మాత్రం నిరంతరం ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వారు. పిల్లలు ఆడుతూపాడుతూనే విద్యనభ్యసించే విధంగా ప్రణాళిక రూపొందించారు.

గోడలపై పాఠాలు

గ్రానైట్ పనుల కోసం వచ్చిన వారంతా ఇక్కడ తమిళులే. మగవాళ్లు గ్రానైట్ పనులు చేస్తుంటే ఆడవాళ్లు పాలిష్ పనులు చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాలనలో కాలనీ కోసం స్థలం కేటాయించారు. అందుకే ఆ కాలనీకి ఎన్టీఆర్ తమిళకాలనీగా పేరు పెట్టుకున్నారు. కాలనీలో 103మంది పిల్లలు ఉన్నారు. ఈ చిన్నారులు చదువు మరిచిపోకుండా ఉండాలంటే పాఠాలే వారి చెంతకు తీసుకురావాలని ప్రేమలత ప్రణాళిక రూపొందించారు. వీధివీధినా గోడలపై అందంగా అక్షరాలు రాయించారు. బొమ్మలు గీయించారు. దీంతో విద్యార్థులంతా ఆసక్తిగా పాఠాలు చదవడం ప్రారంభించారు. అందుకే ఆ టీచర్​ చేసిన ప్రయత్నం ఉన్నతాధికారుల మన్ననలు పొందుతోంది.

కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆటపాటల్లో పడి నేర్చుకున్నది సైతం మరిచిపోతున్నారు. పేద విద్యార్థులు ఆన్​లైన్​ ద్వారా పాఠాలు వినే పరిస్థితి లేదు. అందుకే వారి కోసం వీధుల్లోనే ఇళ్ల గోడలపై ప్రాథమిక విద్యకు సంబంధించి పాఠాలు రాయించాను. దీంతో పిల్లలు ఎప్పుడంటే అప్పుడు చదువుకునే వెసులుబాటు ఉంటుంది. -గాజుల ప్రేమలత, తమిళ కాలనీ స్కూల్​ ఎస్జీటీ

వీధుల్లోనే విద్యాబోధన

చదువుకు దూరమైన విద్యార్థుల కోసం టీచర్​ ప్రేమలత.. ఇలాంటి విధానం అందుబాటులోకి తేవడం అభినందనీయం. ఆమె సొంత ఖర్చులతో గోడలపై పిల్లలకు అవసరమయ్యే పాఠ్యాంశాలు రాయించారు. దీంతో పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. -మధుసూదనా చారి, మండల విద్యాధికారి

తల్లిదండ్రుల హర్షం

కొవిడ్​ కారణంగా పిల్లల చదువు గురించి ఆవేదన చెందిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయురాలు చొరవ తీసుకుని బోధించడంపై హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల లేకపోవడంతో ప్రత్యామ్నాయం లేదని ఆందోళన చెందిన తమకు ప్రేమలత ఒక మార్గం చూపారని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు విద్యార్థులు చదువులు మానేసి వీధుల్లో కనిపించే వారని ఇప్పుడు పరిస్థితి మారిందని పేర్కొన్నారు. ఆడుతూపాడుతూ చదువుకోవడం వల్ల పిల్లలకు పాఠాలు అర్థమవుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరి బలవంతం లేకుండా వారే చదువుకోవడం బాగుందని వివరించారు.

టీచర్​ గాజుల ప్రేమలత.. మా పిల్లల కోసం శ్రమించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా గోడలపై పాఠాలు రాసి బోధించడం ద్వారా పిల్లలు మళ్లీ చదువుపై శ్రద్ధ కనబరుస్తున్నారు. - విద్యార్థి తల్లి, తమిళ కాలనీ

ఎందరికో మార్గదర్శకం

ఈ వీధి చదువు తమకు ఎంతో బాగుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠాలతో పాటు టీచర్‌ చూపిన మార్గంతో గురుకులాల్లో సీట్లు పొందుతున్నారని పేర్కొన్నారు. కరోనా కాలంలో విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపి ఉపాధ్యాయురాలు ప్రేమలత ఆదర్శంగా నిలిచారని స్థానికులు కొనియాడారు. మొక్కుబడిగా చదువు చెప్పే ఉపాధ్యాయులు ఇలా వినూత్నంగా ఆలోచించి పాఠాలు చెబితే నిరక్షరాస్యత నిర్మూలన సాధ్యమవుతుందని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:Bandi Sanjay : భాజపా కార్యాలయ బేరర్లతో బండి సంజయ్ భేటీ...

Last Updated : Aug 29, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details