బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా నిర్మించిన దిగువ మానేరు జలాశయం ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. గతంలో మార్చి వచ్చేసరికి డెడ్‌స్టోరేజి కారణంగా ప్రతి చుక్కను జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు సూచించేవారు. సాగునీటిని పక్కనపెట్టి కేవలం కరీంనగర్, సిద్దిపేటకు తాగునీటి కోసం నీటి నిల్వ ఉండేలా చర్యలు తీసుకునేవారు. ఎండకాలంలో కరీంనగర్ వాసులకు నీరు అందక బూస్టర్ల ద్వారా నీటిని తోడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. డెడ్ స్టోరేజి కాదు కదా... ఈసారి వరద గేట్ల ద్వారానే సుమారు 80 టీఎంసీల నీటిని మానేరు వాగులోకి వదిలిపెట్టగా... ఇప్పటికే కాకతీయ కాల్వ ద్వారా 44 టీఎంసీల నీటిని ఆయకట్టు రైతులకు తరలించారు. మరో 23 టీఎంసీల నీటిని మొత్తం 346కిలోమీటర్ల వరకు సాగునీటిని చేరవేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఫలితంగా ఎండకాలంలోనూ సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రోజు 3,150 క్యూసెక్కులు రాక
దిగువమానేరు జలాశయం పరధిలో సుమారు 8.94లక్షల ఆయకట్టు ఉండగా.. ఏటా నీటి కొరత కారణంగా వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేసేవారు. వారం రోజుల పాటు నీటిని విడుదల చేసి మరోవారం పాటు నీటిని నిలిపివేయడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందేది కాదు. ఇప్పుడు గాయత్రీ పంపుహౌస్ నుంచి మధ్యమానేరుకు... అక్కడి నుంచి రోజు 3,150 క్యూసెక్కుల నీరు దిగువమానేరు జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో వారబందీ పద్ధతిలో కాకుండా ఏకధాటిగా డిసెంబర్ 15 నుంచి 5 వేల క్యూసెక్కులు నీటికి కిందికి వదులుతున్నారు.