తాను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే మంత్రి పదవి పోయిందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. మిగిలిన వారిలా మౌనంగా ఉంటే తాను పదవిలోనే కొనసాగేవాడినన్నారు. తనకు టికెట్ ఇచ్చినవాళ్లే ఓడించాలని చూశారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చెల్పూర్లో తెరాస, భాజపా కార్యకర్తలు.. ఈటల సమక్షంలో భాజపాలో చేరారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో భాగంగా తనపై ఎన్నో కేసులు పెట్టారని, జైలుకు పంపారని ఈటల అన్నారు. కానీ తెరాసలో ఉన్న కొంతమంది నేతలు ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదన్నారు. వారికి ఉద్యమం అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. కానీ అలాంటివారికే పదవులు వచ్చాయని విమర్శించారు.
ఏనాడైన ఉద్యమంలో పాల్గొన్నారా..
కరీంనగర్ మంత్రి ఏనాడైనా జైలుకు వెళ్లి వచ్చారా? ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అంటూ మంత్రి గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావును ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు.హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు.. అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే కుల సంఘాల భవనాలు, పింఛన్లు ఇచ్చి ఆకట్టుకుంటున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఓటు బ్యాంకు కోసం.. హామీల వర్షం కురిపిస్తున్నారని ఆరోపించారు.