Congress protest in huzurabad: కాంగ్రెస్ నాయకుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాసేపు ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఓయూలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుల అరెస్టును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.
ఉస్మానియా వర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తెరాస కండువా వేసుకున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించడంతో గొడవ సద్దుమణిగింది.