హుజూరాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ల కోసం.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత నాలుగు రోజులుగా నామినేషన్లు వేయడానికి వస్తుంటే.. కుంటి సాకులతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామపత్రాలతో సహా వస్తే... ఏవో కారణాలు చెప్పి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, హరీశ్‌రావుకు వ్యతిరేకంగా ఫీల్డ్ అసిస్టెంట్లు నినాదాలు చేశారు.
''మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. విధుల్లోకి తీసుకుంటామని సీఎం ప్రకటన చేయాలి. సీఎం ప్రకటన చేస్తే తెరాసకే మద్దతు ఇస్తాం. కేసీఆర్ ప్రకటన చేయకపోతే తెరాసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం.''
-ఫీల్డ్ అసిస్టెంట్లు
ఇటీవలే హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election nomination)లో రోజుకు వేయి మందితో నామినేషన్లు వేయిస్తామని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ క్షేత్రసహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య తెలిపారు. 18 నెలల నుంచి తమను విధుల్లోకి తీసుకోకపోవడం వల్లే ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో.. ఫీల్డ్ అసిస్టెంట్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నిబంధనల ప్రకారం ఎవరైనా నామినేషన్లు వేయొచ్చని అధికారులు తెలిపారు. నామినేషన్ల సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇవాళ్టితో హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్లు పూర్తవుతాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:Huzurabad Bypoll Nomination: మమ్మల్ని నామినేషన్ వేయనీయరా? ఏంటండీ కుంటిసాకులు!