రహదారి విస్తరణ కోసం తమ భూములు ఇవ్వబోమని జాతీయ రహదారిపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రైతులు ధర్నాకు దిగారు. తమకు రోడ్డు అవసరం లేదని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. భూ సర్వేను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. అటుగా వెళ్తున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారిని అడ్డుకున్నారు. వాహనం వెళ్లకుండా రోడ్డుపై అడ్డంగా పడుకున్నారు.
భూములు ఇవ్వం...
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి 563 రోడ్డు పనుల విస్తరణలో భాగంగా అధికారులు భూ సర్వేను నిర్వహించారు. హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్, కొత్తపల్లి, బోర్నపల్లి, రంగాపూర్, రాంపూర్, పెద్దపాపయ్యపల్లి, కందుగుల గ్రామాల్లోని పలు వ్యవసాయ భూముల్లో సర్వే నిర్వహించారు. తమ భూములను సర్వే చేయొద్దని, భూములు ఇచ్చేది లేదంటూ రైతులు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్డీవో, తహసీల్దార్ బావుసింగ్‌లతో మాట్లాడారు. సర్వేకు సహకరించాలని అధికారులు కోరగా... రైతులు ససేమిరా అన్నారు. సుమారు గంటపాటు చర్చలు జరిపినప్పటికీ రైతులు అంగీకరించలేదు.
మా భూములు మాకే...
తమకు ఎలాంటి నష్టపరిహారం అవసరం లేదని, తమ భూములు తమకే కావాలంటూ అన్నదాతలు డిమాండ్ చేశారు. కొందరు రైతులు పురుగుల మందు డబ్బాలను తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవటంతో కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించారు. తమ భూములు తమకే కావాలంటూ నినాదాలు చేశారు.