kaleshwaram third TMC: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మూడో టీఎంసీ కాలువ భూసేకరణను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ భూములకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితుల డిమాండ్లపై విచారణ కోసం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లికి ఆర్డీవో చేరుకోగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు.
వ్యవసాయ ఆధారిత ఆస్తులకు పరిహారం చెల్లింపులను లెక్కించడం లేదని గ్రామస్థులు తెలిపారు. తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదని కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్‌కు గ్రామస్థులు వివరించారు. పరిహారం చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. గ్రామ పంచాయతీలో భూనిర్వాసితులు అందరూ సమావేశం కావాలని ఆర్డీవో కోరినా నిరసన తెలుపుతూ గ్రామస్థులు శివారులోనే బైఠాయించారు. దీంతో భూనిర్వాసితులు హాజరు కాకుండానే అధికారులు గ్రామసభను ముగించారు.
భూమి పోతే మేం బతకలేం సార్. భూములు తీసుకుంటే మేం ఏట్ల బతుకుడు. ఆవతల భూములు కొనాలన్న లక్షలు పోసినా వస్తలేం. మేం కష్టం చేసుకుందామన్న చేతకాదు. మాకు అనుకున్న ధర రావాలె. లేకపోతే మేం భూములివ్వం.
- పోచమ్మ, శ్రీరాములపల్లి మహిళా రైతు