Farmers protest land acquisition for canal: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో మొదటి లింక్ కెనాల్ భూసేకరణను నిలిపివేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. రామచంద్రాపురంలోని ఎస్సారెస్పీ వరద కాలువ గట్టుపై వంట-వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వరద కాలువ నుంచి లింక్ కెనాల్ నిర్మాణాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భూసేకరణకు చెల్లించే పరిహారం సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎస్సారెస్పీ వరద కాలువ కోసం భూములు కోల్పోయిన రైతులే... మళ్లీ కొత్త కాలువ కోసం నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామడుగు మండలంలో రూ.240కోట్లతో చేపట్టనున్న నాలుగు కాలువలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
నాది ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎనిమిది ఎకరాల భూమి పోయింది. అక్కడ పోయిందని ఇక్కడ కొనుకున్నా. మళ్లీ మూడు, నాలుగు ఎకరాలు పోతుంది. రోడ్డు వెంట ఉన్న భూమి విలువ రూ.5 కోట్లు అయితే నాకు రూ.60 లక్షలు వచ్చినయి. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సరిపోదు. ఇప్పుడు వేరే దగ్గర కొనాలన్నా ధరలు బాగా పెరిగినయ్. ఈ ఏరియాకు కెనాల్ లింక్-1 అవసరం లేదు.
-కారుపాకల నారాయణ, రామడుగు రైతు
మాది చిన్న రైతు కుటుంబం. భూమి కొంచమే ఉంది. దానికే చుట్టూ నాలుగు వైపులా జాలు పారుతోంది. పొలాలు వేసుకుంటే ... వాటి కోతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కోతకే ఎకరానికి రూ.17వేలు ఖర్చయ్యాయి. నీళ్లు జాలు రాకపోతే అంతర పంటలు వేసుకోవచ్చు. ఇన్ని నీళ్లు వస్తుంటే పొలాలు కూడా కష్టమే. ఇదీ మా పరిస్థితి. మేమేం చేయాలి?