గతేడాదితో పోలిస్తే పెద్దపల్లి జిల్లా మినహా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీనితో నీరు అందుబాటులో ఉన్నా వరి పంట వేయవద్దంటే ఏమి చేయాలో అర్ధం కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బావుల్లో నీరు చేతితో ముంచుకొనే విధంగా నీటి మట్టం పెరిగింది. గతంలో ఐదారు మీటర్ల లోతులో నీరు కాస్తా ఇప్పుడు చేతికి అంది వచ్చింది. అటు బావుల్లోనే కాకుండా పొలాలు సైతం నీటి కారణంగా బురదమయంగానే ఉన్నాయి. నీరు అందుబాటులో లేనప్పుడు ఆరుతడి పంటలు వేసుకున్నా కొంత బాగుంటుంది కాని ఇప్పుడు ఆరుతడి పంటలు ఎలా వేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
ఇతర పంటలు ఎలా వేయగలం?
ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉన్నా నీళ్లతో బురదమయంగా ఉండటంతో యంత్రాలు కోతలు చేపట్టలేని స్థితిలో ఉన్నాయని.. అందువల్లనే కూలీలతో పంటలు కోయిస్తున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వరి పంటకు బదులు ఇతర పంటలు ఎలా వేయగలమని ప్రశ్నిస్తున్నారు. పొలాలు, బావుల్లో నీరు తగ్గలేదని... ఇప్పుడు ఏ పంట వేయలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు ఏ పంట కూడా ఈ పొలాల్లో వేయలేమని వాపోతున్నారు. వరి పంట వేయవద్దని సూచిస్తున్న సర్కార్.. ప్రత్యామ్నాయం చూపెట్టక పోతే మాత్రం ఉరి పెట్టుకొనే పరిస్థితి ఉంటుందని రైతులు హెచ్చరిస్తున్నారు.
రైతులు ఉరిపెట్టుకోవాల్నా?
మాకు వర్షాకాలం నీరు ఇవ్వకున్నా వానలతోనే వరి పండించినం. బావులు పూర్తిగా నిండి ఉన్నాయి. పొలాల్లో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏ పంట వేయరాకుండా ఉంది. నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు వేయరాదు. ఏ పంట పెట్టినా అది పండదు. మరి ఏ పంట పెట్టాలో ప్రభుత్వం చెప్పి తీరాలి. పొలాలను బీళ్లుగా వదిలేయాలా?. చెరువులు, కుంటలు కట్టించి పంటలు పండించుకోమన్నారు. ఇప్పుడేమో మరి వరి వద్దంటున్నారు. మా పరిస్థితి ఏంది, మా పిల్లల పరిస్థితి ఏంది?. రైతులు ఉరిపెట్టుకోవాల్నా. -ఎల్కోజి చినమల్లయ్య, రైతు, బీర్పూరు, జగిత్యాల జిల్లా
ఏ పంట వేయాలి?
వరిపంట కోసి వడ్లు అమ్మడానికి కేంద్రాల్లో పోసినం. మరి ఇప్పుడు ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు. భూగర్భజలాలు పెరిగి పొలాల్లో నీళ్లు ఊరుతున్నాయి. మరి ఈ పొలాల్లో ఏ పంట వేయాలో చెప్పాలి. ఇంతవరకైతే మేం ఎప్పుడైనా పొలాలే వేసినం. ఇప్పుడు ఏం వేయాలో అర్థం కావట్లేదు. -సూద రమేశ్, రైతు, జగిత్యాల జిల్లా