తెలంగాణ

telangana

By

Published : Feb 14, 2023, 7:29 PM IST

ETV Bharat / state

పసుపు పంటకు సరైన మద్దతు ధర లేక రైతుల ఆందోళన

Farmers worried for turmeric crop in TS: వరికి ప్రత్యమ్నాయ పంటలు వేయాలని ప్రకటనలే తప్ప.. ప్రత్యమ్నాయ పంటలకు సరైన మద్దతు ధర మాత్రం లభించలేదని రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. దశాబ్దాలుగా పసుపు పంటనే నమ్ముకున్న రైతులకు మద్దతు ధర మాత్రం గగనమౌతోంది. పసుపు పంటకు పెట్టుబడులు గణనీయంగా పెరిగినా ధర మాత్రం దశాబ్దంగా పెరగ లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Farmers are worried about proper support price for turmeric crop
పసుపు పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఆందోళన

పసుపు పంటకు సరైన మద్దతు ధర లేక రైతుల ఆందోళన

Farmers worried for turmeric crop in TS: కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పసుపు తవ్వకాలు మొదలయ్యాయి. మరో వారం పదిరోజుల్లో మార్కెట్‌కు పసుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం పసుపు ధర విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పదేళ్ల కింద క్వింటాలు ధర రూ.15వేలు పలికేదని ప్రస్తుతం రూ.3500లు నుంచి రూ.5000లు వరకు మాత్రమే పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా పసుపు ధర పెరుగుతుందన్న ఆశతో ఉన్నా ఏ మాత్రం నెరవేరే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే పసుపు పంటకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయిందని రైతులు అంటున్నారు.

కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు: పసుపును మంగళకరంగా భావిస్తారు. పూజల్లో వంటలతో పాటు ఔషధాల్లోను వినియోగిస్తుంటారు. దీంతో జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు. సాధారణంగా సీజన్ ప్రారంభంలోనే క్వింటాలుకు కాస్తా ఎక్కువగానే పెట్టి కొనుగోలు చేస్తారని.. మార్కెట్‌కు పసుపు పోటెత్తడంతోటే ధరను తగ్గించి కొనుగోలు చేస్తారని కర్షకులు తెలిపారు. ఇది గత దశాబ్దకాలంగా జరుగుతోందని రైతులు వాపోతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పసుపు పంటకు మద్దతు ధర కల్పిస్తామని హామి ఇచ్చారు. స్వయం సహాయక సంఘాలతో కొనుగోళ్లు చేయిస్తామని చెప్పారు. ఇంతవరకు హామీ నెరవేరక పోగా.. కనీసం మార్క్‌ఫెడ్‌తో కొనుగోలు చేయించే ప్రయత్నం చేయలేకపోడం చాలా బాధాకరమని అన్నారు. ప్రైవేటు వ్యాపారస్థులు చెప్పిందే వేదంగా ధర కొనసాగుతోందని రైతులు వాపోతున్నారు.

పండించడానికే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి: వాస్తవానికి పదేళ్ల కిందట 2012లో పసుపు ధర క్వింటాలుకు 15వేలు పలికింది.అప్పట్లో వాస్తవానికి గతంలో రైతులు పసుపు పంటతో మంచి లాభాలు పొందారు. అప్పటికి ఇప్పటికి చూస్తే పెట్టుబడి ఖర్చులు రెండు మూడు రెట్లు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. అప్పట్లో ఎకరానికి రూ.50వేలు పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.80వేలు నుంచి లక్షరూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు. మరికొందరు కోళ్ల ఎరువుతో భూసారం పెంచడానికి రూ.1.20లక్షల నుంచి రూ.1.30లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఇందులో పసుపు తవ్వకం, ఉడకపెట్టి, ఆరబెట్టే దశల్లోనే రూ.40వేలు నుంచి రూ.50వేలు వరకు ఖర్చు అవుతోందని రైతులు అంటున్నారు.

పెట్టుబడి మూడింతలు పెరిగితే దిగుబడి ఒకింత తగ్గింది: గత పదేళ్లలో పెట్టుబడి ఖర్చులు మూడింతలు పెరిగితే పసుపు ధర మాత్రం ఒక వంతుకు పడిపోయిందని అన్నారు. దీనికి తోడు గత మూడేళ్లుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు దుంపకుళ్లు సోకి పసుపు కొమ్ములు బలంగా ఊరడం లేదని అన్నారు. దిగుబడి కాస్తా ఎకరానికి 10-12 క్వింటాళ్ల వరకే వస్తోందని రైతులు చెబుతున్నారు. సగానికి సగం దిగుబడి తగ్గి ధర లేకపోవడంతో రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మద్దతు ధర ఇప్పించక పోతే పసుపు పంటను పండించలేని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వివరించారు.

"కిందటి సంవత్సరం జూలైలో పసుపు పంట వేశాను. సుమారు రూ.70వేలు వరకు రాబడి పెట్టాను. అధికంగా వర్షాలు పడడం వలన పసుపు అంత పుచ్చు పట్టేసింది. మద్దతు ధర రూ4800 నుంచి రూ.5000 వెళుతుందని చెబుతున్నారు. ఆఖరికి పంటకి పెట్టిన సగం ఖర్చు కూడా మాకు రావడం లేదు. ఇదే పరిస్థితులు కొనసాగితే పసుపు రైతులు పంట పండించడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని కోరుతున్నాను. ఇట్లానే కొనసాగితే భవిష్యత్తులో పసుపు కనుమరుగు అయిపోతుంది." - కొమ్ముల సంతోష్‌రెడ్డి, పసుపు రైతు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details