కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి తామెలా కష్టాలు పడుతున్నామో చెప్పుకొని వాపోయారు. పాసు పుస్తకాల విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి అనే రైతు ఏడాది కిందట తనకున్న ఎకరం పొలాన్ని.. తన కుమారుడి పేరు మీద పట్టా చేయించారు. ఇప్పుడు దానిని జమాబంది చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో పలుమార్లు కలెక్టర్‌కు వినతి పత్రం పెట్టుకున్నా స్పందించడం లేదని కృష్ణారెడ్డి చెప్పారు. వేల రూపాయలు జిరాక్స్‌ల కోసం ఖర్చు పెట్టినా ఫలితం లేదని వాపోయారు. ఈ రోజు కూడా అధికారులు మొండి చేయి చూపించడంతో వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా తన వినతి ఎందుకు పూర్తి కాలేదని అధికారులపై మండిపడ్డారు. దీంతో కంగుతిన్న అధికారులు ఆయన ఫైల్‌ను వెతికారు. చివరకు ఫైల్ కలెక్టర్ సంతకం కోసం పంపారని అధికారులు సమాధానమిచ్చారు. సంతకం అయిపోతే జమాబంది అయిపోతుందని చెప్పారు. వచ్చే సోమవారానికి పని పూర్తి కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి కృష్ణారెడ్డి వెనుదిరిగారు.