తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణిలో సమాధానం దొరకని ప్రశ్నలు.. దిక్కుతోచని స్థితిలో రైతులు - Karimnagar District Latest News

ధరణిలో ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని సర్వే నంబర్లలో ప్రభుత్వం సేకరించిన భూమి పోను మిగిలిన భూములకు రిజిస్ట్రేషన్లు కావడం లేదని అన్నదాతలు చెప్తున్నారు. సేల్‌ డీడ్‌కు చలానా చెల్లించినా చెల్లింపు పెండింగ్‌ అని వస్తోందంటున్నారు. సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Farmers are urged to set up Dharani help centers
ధరణి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కర్షకులు విజ్ఞప్తి

By

Published : Mar 8, 2021, 10:10 AM IST

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో వెంకటరాంరెడ్డి అనే రైతుకున్న పాసుపుస్తకంలో 213, 416, 417, 418 సర్వే నంబర్లలో వ్యవసాయ భూమి ఉంది. 213 మినహా ఇతర నంబర్లలోని భూముల్లో నివాస గృహాలు ఉన్నాయి. ఇప్పుడు అవసరాలకు 213 సర్వే నంబరులోని 1.14 ఎకరాల పట్టా భూమిని విక్రయించుకుందామని అతను ప్రయత్నిస్తే కుదరడం లేదు. పాసుపుస్తకంలో పేర్కొన్న ఇతర సర్వే నంబర్లలో ఇళ్లు ఉండటంతో రిజిస్ట్రేషన్‌ కావడం లేదు. చేతిలో భూమి ఉన్నా డబ్బు అవసరమైన సమయంలో అక్కరకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఈ ఒక్క రైతు సమస్యే కాదు.. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ధరణి పోర్టల్‌లో ఇలాంటి సమస్యలకు ఏం చేయాలన్నదానిపై మార్గదర్శకాలు లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్​లోని కొన్ని మండలాల్లో కొన్ని సర్వే నంబర్లలో ప్రభుత్వం సేకరించిన భూమి పోను మిగిలిన భూములకు (ఉప నంబర్లలో) రిజిస్ట్రేషన్లు కావడం లేదని కర్షకులు చెప్తున్నారు.

చలానా చెల్లించినా బుక్‌ కాని స్లాట్‌..

ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు జిల్లాల్లో, రెవెన్యూ డివిజన్లలో సహాయ కేంద్రాలు (హెల్ప్‌ డెస్క్‌) ఏర్పాటు చేయాలని బాధితులు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఓ రైతు సేల్‌ డీడ్‌కు చలానా మొత్తం ఇటీవలే చెల్లించారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తం చెల్లించినట్లు ఎస్‌ఎంఎస్‌ (మెసేజ్​) వచ్చింది. ధరణిలో తీరా చూస్తే చెల్లింపు (పేమెంట్‌) పెండింగ్‌ అని వస్తోంది.

స్పందించడం లేదు..

తహసీల్దారు కార్యాలయంలో దీనిపై విచారిస్తే తమకు వివరాలేవీ కనిపించవని, స్లాటు నమోదైతే తప్ప ఏమీ చెప్పలేమని అంటున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పలు సమస్యలకు గతంలో హైదరాబాద్‌లో ఉన్న ధరణి హెల్ప్‌ డెస్క్‌ వాళ్లు సమాధానాలు ఇచ్చేవారని అన్నారు. ఇప్పుడు స్పందించడం లేదని ఆయన తెలిపారు. సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details