కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌కు చెందిన 62 ఏళ్ల బద్దెనపల్లి అంజయ్య... ఇరవై ఏళ్ల కిందట తీర్థయాత్రలకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లను కోల్పోయారు. అదే ప్రమాదంలో పెళ్లీడుకొచ్చిన కూతురు కాలుని కూడా తొలిగించడం ఆయన బాధను రెట్టింపు చేసింది. వ్యవసాయమంటేనే అమితమైన మక్కువున్న అంజయ్య ఎలాగోలా ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని మళ్లీ బతుకు సాగును ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన తరువాత ఏడాది రెండేళ్ల నుంచే చిన్నపాటి పనులు చేసినా... ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవాలంటే మళ్లీ వ్యవసాయం చేయడం తప్ప.. మరో మార్గం లేదని నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పమే ఆసరాగా ఇన్నాళ్లుగా నేలతల్లి కడుపున బంగారాన్ని పండించేలా.. పోరాటా పటిమ చూపిస్తున్నారు.