ఎలాంటి పరిశోధన చేయకపోయినా.. కాసులు కురిపిస్తే చాలు మీ పేరు ముందు డాక్టర్ అనే పేరు జత చేస్తారు. మెదడుకు పదును పెట్టకుండా.. పుస్తకాలు తిరగేయకుండా.. పరిశోధన చేయకుండానే.. మిమ్మల్ని డాక్టరేట్‌లుగా మారుస్తారు. అంగడిలో డాక్టరేట్ పట్టాలంటూ దళారులు కొత్త వ్యాపారానికి తెరలేపారు.
సామాజిక సేవ చేసినట్లు ఓ ఫొటో తీసుకొస్తే చాలు డాక్టరేట్లని తయారు చేస్తామని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రకటనలతో ఇటీవల కొంత మంది డాక్టరేట్ పట్టాలను కూడా పొందారు. ఈ ప్రకటనను చూసిన శ్రీనివాస వరప్రసాద్ అనే వ్యక్తి వారి భండారాన్ని బయట పెట్టాలనుకున్నారు. దానికి ఓ పథకం వేశారు.
కరీంనగర్‌కు చెందిన కస్తూరి శ్రీనివాస వరప్రసాద్.. డాక్టరేట్ కావాలని ఓ మధ్యవర్తిని ఆశ్రయించారు. ఆ మధ్యవర్తి డాక్టరేట్ పట్టాలిచ్చే వర్సిటీ ప్రతినిధికి ఫోన్ చేసి, శ్రీనివాస్‌ను మాట్లాడించాడు. రూ.30 వేలు ఇస్తే మెయిల్ ద్వారా పట్టాను పంపిస్తామని వర్సిటీ ప్రతినిధి చెప్పగా.. శ్రీనివాస్ బేరసారాలకు దిగారు. తన వద్ద రూ.30 వేలు లేవని, కొంత రాయితీ ఇవ్వాలని కోరగా.. చివరకు రూ.20 వేలకు బేరం కుదిరింది.
వారి ఖాతాలో డబ్బు జమ చేసిన 15 నిమిషాల్లోనే.. మెయిల్‌కు డాక్టరేట్ పట్టాను పంపించాం.. చూసుకోండంటూ శ్రీనివాసవరప్రసాద్కు వర్సిటీ ప్రతినిధి ఫోన్ చేశాడు. వర్సిటీ ప్రతినిధి తనతో మాట్లాడిన ఫోన్ సంభాషణను రికార్డు చేసిన శ్రీనివాస వరప్రసాద్.. ఆ ఆడియోను పోలీసులకు అందించి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండిపరువు హత్య హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు