హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది (Huzurabad by-election results). ముఖ్యంగా రాజకీయ నాయకుల మదిలో ఓట్ల అంచనాల లెక్కలే మెదులుతున్నాయి. రేపే ఇక్కడి ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధమవుతుండటంతో అంచనాలు.. మంతనాల జోరు ఊరువాడల్లో ఇంతకింతకు పెరుగుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెండు పార్టీల అభ్యర్థుల గెలుపు విషయంలో నాయకులు ఎవరికి వారుగా ధీమాను వ్యక్తపరుస్తున్నారు. పైకి కచ్చితంగా గెలుస్తామనే ధీమాను చూపిస్తున్నా లోలోపల మాత్రం ఈవీఎంలో పదిలమైన ఓట్ల గురించే ఆలోచిస్తున్నారు.
ఏ మండలంలో ఎంత ఆధిక్యత.?
రేపే ఓట్ల లెక్కింపు జరగనుండటంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల వారీగా పడిన ఓట్లను ప్రధాన పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా చేపట్టిన ప్రచారాలకు తగినట్లుగా ఓటర్లు ఎలా ఆదరణ చూపించారనే విషయమై తర్జనభర్జన పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గడ్డకు పడతామనే తీరుతో ఆశగా ఉంటున్నా.. పోలింగ్ రోజుకు ముందు వారంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏ పార్టీకి అనుకూలం మారాయనే ఆందోళన ఆయా పార్టీల్లో కనిపిస్తోంది. అప్పటి వరకు ఆయా ప్రాంతాల వారీగా మనకే ఆధిక్యం అనుకున్న వారంతా పోలింగ్ తరువాత మారిన బలాబలాల్ని బేరీజు వేసుకుంటున్నారు. ప్రత్యర్థుల ఎత్తుల ముందర తమ పాచిక ఏ మేరకు పారిందనేది ఈవీఎంల నుంచి వెలువడే ఓట్ల తీరుతోనే తెలియనుందనేలా సమయం కోసం నిరీక్షిస్తున్నారు.
ముఖ్యంగా హుజూరాబాద్, జమ్మికుంట (jammi kunta) పురపాలికల్లో ఓట్లు అధికంగా ఉండటం, వీటికి ఆనుకుని ఉన్న గ్రామాల ఓటర్లు ఈ ఎన్నికల్లో విజయావకాశాల్ని నిర్ణయిస్తారనేది స్పష్టంగా తెలుస్తోంది. పోలైన ఓట్ల ఆధారంగా ఆయా పార్టీలు ఫలాన పోలింగ్ బూత్‌లో ఇన్ని ఓట్లు తమకని.. మిగతావి ప్రత్యర్థులకని లెక్కలు వేస్తున్నారు. మరోవైపు స్వతంత్రులుగా ఈ సారి 20 మంది రంగంలో నిలవడంతో వారి ఓట్లు ఎంత వరకుంటాయనే విషయమై కూడా చర్చించుకుంటున్నారు. చాలా మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించే వీలులేదని తెలుస్తోంది. మొత్తంగా ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే గెలుపు పీఠాన్ని అందుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వచ్చిన విధంగా భారీ ఆధిక్యతలు ఉండవనేది తెలుస్తోంది. మొత్తంగా ఈ సారి ఓటరు వెలువరిచే విలక్షణ తీర్పు ఎలా ఉండనుందనేది రేపు మధ్యాహ్నం వరకు వెల్లడవనుంది. కీలకమైన హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనేది తెలియనుంది.
ఇదీ చూడండి:HUZURABAD: హు‘జోరు’ పోలింగ్.. ఉపఎన్నికలో 86.57 శాతం నమోదు