తెలంగాణ

telangana

ETV Bharat / state

Etela Rajender: నా ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధం.. హరీశ్​కు ఈటల సవాల్ - తెలుగు వార్తలు

మంత్రి హరీశ్​రావుపై మరోసారి ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. హరీశ్‌ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. తనకున్న ఆస్తులు, నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమని మంత్రి హరీశ్‌రావుకు ఈటల సవాల్‌ విసిరారు.

Etela Rajender
Etela Rajender

By

Published : Aug 12, 2021, 2:45 PM IST

నా ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధం.. హరీశ్​కు ఈటల సవాల్

హుజూరాబాద్​ను శాయశక్తులా అభివృద్ధి చేశానని భాజపా నేత ఈటల రాజేందర్​ అన్నారు. హుజూరాబాద్‌లో పెద్దగా పెండింగ్‌ పనులు లేవని వెల్లడించారు. చేసిన పనులకు చాలా మందికి బిల్లులు రావడం లేదని వ్యాఖ్యానించారు. తనకు భాజపా నేతల నుంచి పూర్తి సహకారం ఉందని స్పష్టం చేశారు. తనది కారు గుర్తు అని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. మూడు నెలల నుంచి ప్రచారం చేస్తున్నా.. ఎన్నికల్లో గెలిచేది తనేనని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు డబ్బులు చెల్లించట్లేదని మండిపడ్డారు. భూములు విక్రయించి హుజూరాబాద్‌లో డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.

హరీశ్​రావు ఎంత చేసినా.. ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తే.. చరిత్ర క్షమించదని అన్నారు. ​18 సంవత్సరాల అనుబంధం ఉందని.. అవన్నీ మర్చిపోయి.. ఇలా ఆరోపణలు చేయొద్దని హెచ్చరించారు. మోసపు మాటలు హుజూరాబాద్ ప్రజలెవ్వరూ నమ్మరని... దుబ్బాకలో ఫలితాలే హుజూరాబాద్‌లోనూ పునరావృతం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనకున్న ఆస్తులు, నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమని మంత్రి హరీశ్‌రావుకు ఈటల సవాల్‌ విసిరారు.

ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యావని హరీశ్​పై మండిపడ్డారు. మామ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తున్నావ్.. కానీ తాను ఒక్క అవకాశం ఇస్తే ఓటమి లేకుండా ప్రజల ప్రేమను పొందిన వాడినని ప్రకటించారు.

హుజూరాబాద్​లో అభివృద్ధి జరగలేదన్నారు. నువ్వు నిన్న తిరిగిన రోడ్ల అన్ని నేను వేయించినవే. 2018లో 50 మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చాను. ఈరోజు మీరు ఓట్ల కోసం ఇస్తున్నారు. హుజూరాబాద్​లో 3,900 ఇళ్లు మంజూరు అయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చాను. 18 చెక్​డ్యాంలు కట్టించా. 1050 కోట్లతో ఎస్సారెస్పీ కాలువలు బాగు చేయించా. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలకు ఒక్కోదానికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే.. ఇవ్వకుండా ఆపింది కేటీఆర్. మళ్లీ ఇవే డబ్బులు మంజూరు చేస్తామంటూ జీవో. ఇప్పటికీ 192 కోట్ల రూపాయలు హుజూరాబాద్​లో ఖర్చు పెట్టారు. నన్ను ఓడగొట్టడానికి కేసీఆర్ ప్రతిపక్ష నేతలకు డబ్బులు ఇచ్చారు.

- ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత

ఇదీ చూడండి:ETELA RAJENDER: ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు నాదే

రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్​లు అన్నీ ట్యాప్ అవుతున్నట్లు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 17 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు.. ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. 2017 నుంచే బానిస బతుకులు మొదలయ్యాయని తెలిపారు. మంత్రులకు కూడా సీఎం దగ్గర అపాయింట్​మెంట్ లేదని ఆపితే.. ఇదే కరీంనగర్ మంత్రి... సీఎం కేసీఆర్​పై మండిపడ్డారు. ''ఇంత అహంకారామా?.. ఇంత దొరతనమా?... కరీంనగర్ నుంచే మళ్లీ ఉద్యమం రావాలి'' అని గంగుల కమలాకర్​ అన్నట్లు గుర్తు చేశారు. ప్రగతి భవన్​ కాదు.. బానిస భవన్​ అని పెట్టుకో అని సంతోష్​ కుమార్​కు ఆనాడే చెప్పినట్లు తెలిపారు.

దమ్ము ఎవరికి ఉందో తెలుసుకోండి. నా పదవి కంటే నా ఆత్మ గౌరవం గొప్పది. వందల కోట్లతో ప్రజలను కొనడానికి పునాది వేసిన కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. డబ్బులు ఖజానాలో నిండుగా ఉంటే... ఎందుకు మధ్యాహ్న భోజనం పథకం వారికి డబ్బులు ఇవ్వడం లేదు. ఎందుకు జీతాలు 20 వరకు ఇవ్వడం లేదు.

- ఈటల రాజేందర్, మాజీ మంత్రి, భాజపా నేత

ABOUT THE AUTHOR

...view details