కరీంనగర్ సీపీ స్వయంగా సీఐలకు, పోలీసులకు ఫోన్ చేసి తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి భాజపాలోకి చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ.. భాజపా కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఈటల ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినట్లు ఈటల పేర్కొన్నారు. ఈ బెదిరింపులు, పంపకాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకేనని.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరన్నారు. అన్నింటి కన్నా గొప్పది ప్రజాశక్తి అని పేర్కొన్న ఈటల.. ప్రజలే చరిత్ర నిర్మాతలని, హుజూరాబాద్ చరిత్ర రాసేది ఇక్కడి ప్రజలే అన్న విషయం మరవొద్దని హెచ్చరించారు. ప్రజలను ఆపగలిగే, కొనగలిగే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు.