గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధిని గురించి ప్రశంసించిన వారే ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తెరాస ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. తెరాస నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గత పద్దెనిమిదేళ్లుగా నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నానని అన్నారు. హుజూరాబాద్ అభివృద్ధిపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. పదవులు, ప్రలోభాల కోసం విలువలు అమ్మకోవడం తనకు సాధ్యం కాదని పునరుద్ఘాటించారు. అందుకే పదవికి రాజీనామా చేసి మళ్లీ జనం ముందుకు వచ్చినట్లు వివరించారు. ఈటల రాజేందర్ గెలిస్తే ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లో ఉండే కేసీఆర్ బయటికొస్తారని అన్నారు. తెలంగాణ వస్తే నా ఆడ బిడ్డలకు, తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఈటల రాజేందర్ విమర్శించారు.