యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్... యువకుల ఓట్లు కొందామని ప్రయత్నిస్తున్నారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Fire on Kcr) ఆరోపించారు. మిగతా నియోజకవర్గాల్లో అలానే గెలిచి ఉంటారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ప్రజలు డబ్బు, మద్యానికి ఓట్లు వేయరని అన్నారు. జమ్మికుంట మండలం రామన్నపల్లిలో ఈటల రోడ్‌షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
2018 ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి ఇస్తానంటూ సీఎం కేసీఆర్... ఓట్లు దండుకొని మోసం చేశారని ఆయన విమర్శించారు. ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు ఓటుకు మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేద్దామనే దుష్ట ఆలోచనతో ఉన్నారని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజలు అవసరమైతే కేసీఆర్‌కే డబ్బులు ఇస్తారని ఒక లిక్కర్ బాటిల్ కూడా కొని ఇస్తారని ఎద్దేవా చేశారు.
ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్(Cm Kcr)తో పాటు ఆయన అల్లుడు హరీశ్‌రావు(Harish Rao)కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.