తెలంగాణ బిడ్డల బలిదానాల వల్లే రాష్ట్రాన్ని సాధించుకున్నామని హుజూరాబాద్ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే.. ప్రజలు పోరాడిన తెరాసను గెలిపించారని గుర్తు చేశారు. అలాగే దళితబంధు పథకం మీపై ప్రేమతో ఇవ్వలేదని.. కేవలం నాపై ద్వేషంతోనే ఇస్తున్నారని ఆరోపించారు. దళితబంధు ఇచ్చినా కేసీఆర్‌కు ఓటేస్తారా.. అందుకు కారణమైన మీ బిడ్డకు ఓటేస్తారా మీరే నిర్ణయించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కిష్టంపేట, రెడ్డిపల్లి గ్రామాల్లో ఆయన ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నా ఆడబిడ్డల అభయహస్తం చెక్కులు ఇప్పుడు ఇస్తున్నారంటే అది కూడా నాపై కోపంతోనేనని ఈటల అన్నారు. వారిచ్చే పథకాలను తీసుకోండి.. కానీ వాటికి కారణమైన ఈటల రాజేందర్‌ను మర్చిపోవద్దన్నారు. తెలంగాణ ఒక్క కేసీఆర్ వల్ల మాత్రమే రాలేదన్నారు. 1200 మంది బలిదానాలు చేస్తేనే రాష్ట్రం ఏర్పడిందని ఈటల పేర్కొన్నారు.
దళితబంధు మీపై ప్రేమతో రాలే. దళితబంధు ఈటల రాజేందర్ అసెంబ్లీలో అడుగుపెట్టొద్దనే ద్వేషంతో ఇచ్చిండు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపియ్యలే. పోరాడిన టీఆర్ఎస్ను గెలిపించిండ్రు. కానీ దళితబంధు ఇచ్చిన కేసీఆర్‌కు ఓటేస్తారా..దానికి కారణమైన ఈటలకు ఓటేస్తారా తేల్చుకోండి. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన అభయహస్తం డబ్బులు ఎప్పుడో ఇవ్వాల్సింది. నా మీద ద్వేషంతో ఇవాళ చెక్కులు ఇస్తున్నరు. రాష్ట్రం కోసం తెలంగాణ జాతి మొత్తం పోరాడింది. 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానం ఉంది. ప్రభుత్వమిచ్చే పథకాలు తీసుకోండి. కానీ దానికి కారణమైన ఈ బిడ్డను మర్చిపోకండి. సీఎం కేసీఆర్ ప్రజలను కలవవ్. ప్రగతి భవన్, ఫామ్ హౌస్‌లో ఉంటవ్. మంత్రులు కూడా నిన్ను కలిసే పరిస్థితి లేదు.