హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే (huzurabad by election) దళితబంధు పథకం (dalitha bandhu) తీసుకొచ్చారని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. నియోజకవర్గంలో మిగతా అన్ని వర్గాల కంటే దళితులవి 46 వేల ఓట్లు ఉన్నాయని.. దళితుల ఓట్లమీద ప్రేమతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. తాను రాజీనామా చేయకపోతే దళితబంధు వచ్చేది కాదని ఈటల అన్నారు. మన పుట్టుకకు కారకులు తల్లిదండ్రులైతే.. దళితబంధు పుట్టుకకు ఈటల రాజేందర్ కారణమని పేర్కొన్నారు.
ఎవరైనా భాజపా కండువా కప్పుకుంటే దళితబంధు ఇవ్వమని బెదిరిస్తున్నారని.. నిజాయితీ ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగేలోగా అందరి ఖాతాల్లో దళితబంధు నిధులు జమచేయాలన్నారు. ఆ నిధులపై ఏ స్థాయిలోను అధికారుల పెత్తనం లేకుండా చేయాలన్నారు. తాను దళితబంధు వద్దని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్ల తనపై పుకార్లు సృష్టించారని... అది దొంగ లెటరని... దానిని కేసీఆర్, హరీశ్‌రావు పుట్టించినట్లు ఆరోపించారు.
ఈ బాధ ఇప్పటిది కాదు..
పార్టీ నుంచి గెంటేసినప్పుడు తాను చాలా బాధపడ్డానని... అయితే ఈ బాధ ఇప్పటిది కాదని గత ఐదేళ్లుగా అనుభవిస్తున్నానని పేర్కొన్నారు. 2018 ఎన్నికలకు ముందే తనను తప్పించాలని అంతర్గతంగా చాలా కుట్రలు చేశారని.. గత ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడగొట్టే ప్రయత్నం చేశారని... ప్రత్యర్థులకు డబ్బులు కూడా ఇచ్చారని ఆరోపించారు.
నేను గొంతెత్తిన తర్వాతే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చింది
నేను కేసీఆర్ జీతగాడిని కాదు.. నేను గొంతెత్తి మాట్లాడిన తర్వాతే.. నా పుణ్యమా అని హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇచ్చారు. హరీశ్‌రావును అంతరాత్మ సాక్షిగా చెప్పమనండి తాను బాధపడలేదా అని.. ఇవాళ్టికి కూడా అవమానంతో కుంగిపోతున్న వ్యక్తి కడియం శ్రీహరి. చాలా కాలం బాధను అనుభవించిన తర్వాత తప్పనిసరి పరిస్థితిలో బయటకు వచ్చాను. నేను దళితులు భూములు లాక్కున్నానని నాపై నిందలు వేశారు. ఏదోరకంగా బయటకు పంపుతారనుకున్నాను గాని... ఇలాంటి నిందలు వేసి బయటకు పంపుతారని అనుకోలేదు. రాష్ట్రంలో దళిత అధికారులను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఏడాది నుంచి బాధపెట్టారు. పొమ్మనలేక పొగబెట్టి పదవి నుంచి బయటకొచ్చేలా చేశారు. - ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి.
రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతుంది
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పిన మాట వాస్తవం కాదా అని ఈటల ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన దళితులకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని.. కానీ 1 మంత్రి పదవి మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. సీఎం కార్యాలయంలో ఒక్క దళిత అధికారి కూడా లేడని విమర్శించారు. 50 ఏళ్లకు వృద్ధాప్య పింఛన్ ఇస్తామని, మరెన్నో పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పేదలకు అందని ఎన్నో పథకాలు హుజూరాబాద్‌లో ఎన్నికల సందర్భంగా అమలు చేస్తున్నారన్నారు.
డబ్బులు తీసుకోండి.. నన్ను తలచుకోండి..
హుజూరాబాద్ నియోజకవర్గంలో నేనేమీ అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. వారి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వళ్లించినట్లుంది. 20 ఏళ్ల పార్టీ చరిత్రలో... నాది 18 ఏళ్ల చరిత్ర. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోలేదు.. నన్ను వెళ్లగొట్టారు. దళితబంధయినా.. పింఛనయినా మరే పథకమైనా సొంత సొమ్ము ఇస్తున్నాారా..? ముఖ్యమంత్రి పదవి అంటే ప్రజలకు సేవకుడు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాల ద్వారా 30 వేల కోట్లు ఆదాయం వస్తుంది.. పింఛన్లకు 9వేల కోట్లు అవుతాయి. నేను గెలిచిన తర్వాత దళితబంధు నిలిపేస్తే నేను కొట్లాడతాను. నావల్ల ఓటుకు 20 వేలు వస్తాయంట.. అందరూ తీసుకోండి. దావతులు చేసుకోండి నన్ను తలచుకోండి. అడుక్కుంటే రాదు హక్కు.. కొట్లాడితే వస్తాది.. బానిసత్వంలో మగ్గొద్దు.. నీ బాంచను అనొద్దు. - ఈటల రాజేందర్, భాజపా అభ్యర్థి.
ఇదీ చూడండి:Cm Kcr Speech In Assembly: 'ఊరికొక పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరు'