తెరాస మంత్రిగా ఈటల రాజేందర్ రాజీనామా చేసి... భాజపా తరఫున హుజూరాబాద్ (Huzurabad by poll 2021 ) నుంచి బరిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నికలు (Huzurabad by poll 2021 ) ప్రాధన్యతను సంతరించుకున్నాయి. ఎలా అయినా గెలిచి తీరాలనే కసితో తెరాస ఉండగా... ప్రజలే నన్ను గెలిపిస్తారంటూ ఈటల ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా తన ఉనికిని చాటుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. నామినేషన్ల పర్వం దగ్గరకొస్తున్న సమయంలో ఆయా పార్టీలు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. చూస్తుండగానే నామినేషన్ ప్రక్రియ కూడా వచ్చేసింది. భాజపా అభ్యర్థిగా బరిలో దిగిన ఈటల రాజేందర్ తరఫున.. ఆయన సోదరుడు భద్రయ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ (Huzurabad by poll 2021 ) పత్రాలు సమర్పించారు.
19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయ్..
తనపై ఇప్పటివరకు 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి దాఖలు చేసిన నామినేషన్లో ఆ వివరాలు పొందుపరిచారు. ఈటల తరఫున ఆయన సోదరుడు భద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఉప్పల్ రైల్వే స్టేషన్‌తో పాటు పలుచోట్ల రైలు పట్టాలపై చేపట్టిన ఆందోళన తాలూకు కేసులున్నాయని తెలిపారు. వివిధ ఠాణాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల వివరాలను పేర్కొన్నారు. నేడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి ఈటల నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈటల ఆస్తులు.. నగదు: రూ.లక్ష
- చరాస్తుల మొత్తం విలువ: రూ.6.20 లక్షలు
- భూమి: 13 ఎకరాల 25 గుంటలు (ఇళ్లు, వ్యాపార షెడ్లు, వ్యవసాయ భూమి కలిపి)
- సతీమణి జమున ఆస్తులు.. నగదు: రూ.1.5 లక్షలు
- బ్యాంకుల్లో డిపాజిట్లు, వివిధ సంస్థల్లో పెట్టుబడులు: రూ.28.68 కోట్లు
- భూములు, భవనాలు: రూ.14.78 కోట్లు
- బంగారు ఆభరణాలు: 1,500 గ్రాములు
- వాహనాలు: 3
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరిపై 24..
కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ (వెంకటనర్సింగరావు)పై మొత్తం 24 కేసులున్నాయి. ఈ మేరకు ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయన తరఫున కొల్లూరి కిరణ్ గురువారం హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్‌తోపాటు ఆయన తల్లి పద్మ ఆస్తిపాస్తుల వివరాల్ని ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. తల్లి మెడికల్, ఫార్మసీ వ్యాపారం నిర్వహిస్తున్నారని, తాను ఫిట్‌నెస్ జిమ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, ధర్నాల సందర్భంగా మొత్తం 24 కేసులు వివిధ ఠాణాల్లో నమోదయ్యాయని తెలిపారు.
వెంకట్ ఆస్తులు.. నగదు: రూ.48,525
- వాహనం: రూ.14.50 లక్షల విలువ చేసే టాటా సఫారీ స్ట్రోమ్
- బంగారం: రూ.22.19 లక్షల విలువైన 46 తులాలు
- మొత్తం చరాస్తుల విలువ: రూ.44.51 లక్షలు
- వ్యవసాయ భూములు: 4ఎకరాల 31 గుంటలు
తల్లి పద్మ ఆస్తులు.. నగదు: రూ.95,300
- బంగారం: రూ.14.81 లక్షల విలువైన 30 తులాలు
- మొత్తం చరాస్తుల విలువ: రూ.28.93 లక్షలు
- వ్యవసాయ భూములు: 19 ఎకరాల 21 గుంటలు
- అపార్ట్‌మెంట్, స్థలాల విలువ: రూ. 1.39 కోట్లు