Etela Rajender criticized KCR: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలంటే చిన్నచూపని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈటల ధ్వజమెత్తారు. వరి మద్దతు ధర రూ.2020లు ఉండగా, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేకపోవటంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారన్నారు. దళారులు రూ.1300 నుంచి రూ.1600ల వరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పంట నష్టం విషయంలో కేసీఆర్ స్పందించాలి: ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే వారిపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయని, చేతికందిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకపోతుంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి మంత్రులు, ఎమ్మెల్యేలు విందులు చేసుకుంటున్నారని ఈటల విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను ముమ్మరం చేయాలని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈటల డిమాండ్ చేశారు.