తెలంగాణ

telangana

ETV Bharat / state

భువన్‌ యాప్‌లో ఇళ్లు, భవనాల వివరాల నమోదు - Enter details of houses and buildings in Bhuvan app

నివాసిత, వాణిజ్య అవసరాల భవనాల లెక్క పక్కాగా లెక్కించి ఆస్తిపన్ను మదింపు పరిధిలోకి తీసుకొచ్చేందుకు పురపాలక శాఖ చర్యలు ప్రారంభించింది. భువన్‌ యాప్‌ ద్వారా ఇళ్ల, భవనాల వివరాలను నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పుడున్న ఇళ్ల సంఖ్యకు..క్షేత్రస్థాయిలో ఉన్న భవనాలను గుర్తించి పన్ను మదింపు పరిధిలోకి తీసుకు రానున్నారు.

Enter details of houses and buildings in Bhuvan app in karimnagar
భువన్‌ యాప్‌లో ఇళ్ల, భవనాల వివరాల నమోదు

By

Published : Jul 23, 2020, 12:04 PM IST

కరీంనగర్‌ నగరపాలక సంస్థతో పాటు పురపాలికల పరిధిలో ఇళ్లకు సంబంధించిన మదింపు(అసెస్‌మెంట్ల సంఖ్య) రోజురోజుకు పెరుగుతున్నాయి. మూడేళ్ల కిందట చేపట్టిన ఈ సర్వే మళ్లీ భువన్‌ యాప్‌ ద్వారా సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో ఉన్న అన్నీ ఇళ్లకు వెళ్లి కొలతలు నిర్వహించి అందులో నమోదు చేయనున్నారు. అయితే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు మదింపు జరగకపోవడం, అదనపు అంతస్తులు నిర్మించుకొని ఆస్తిపన్ను పరిధిలోకి రాకపోవడంతో భారీగా ఆదాయం రాకుండా పోతుంది.

భవన వివరాల నమోదు

పురపాలక శాఖ ప్రత్యేకంగా భువన్‌యాప్‌ ద్వారా ప్రతీ ఆస్తిపన్ను మదింపు వివరాలు, భవన చిత్రం, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా చరవాణిలో చిత్రాలు తీసి నిక్షిప్తం చేశారు. ఇంటినంబర్లు వేయని భవనాలు, పన్ను పరిధిలోకి రాని అంతస్తులు, అక్రమ నిర్మాణాలు, భవనాల విస్తీర్ణం వంటి అంశాలు నమోదు చేస్తారు. దీంతో పాటు వాణిజ్య అవసరాలకు సంబంధించిన వివరాలు, నల్లా కనెక్షన్లు, సెల్‌ టవర్లు, దుకాణాల లైసెన్స్‌ అన్నింటి వివరాలను భువన్‌ యాప్‌ ద్వారా వెంటనే నమోదు చేస్తారు. అంతేకాకుండా ఇంటి ఫొటో కూడా అందులో తీసి పొందుపరుస్తారు.

ప్రతీ ఇంటికి గుర్తింపు సంఖ్య

పుర, నగరపాలికల పరిధిలో ప్రతీ ఇంటికి, నివాసానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్యతో ఇంటి క్రమ సంఖ్యలను అనుసంధానిస్తారు. ఏటా ఆస్తిపన్నుకు సంబంధించి గృహ, వాణిజ్య సముదాయాల వారీగా ఎంత చెల్లించాలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నిర్ణయిస్తుంది. వాణిజ్య సముదాయాలను గృహా అవసరాల నిర్మాణాలుగా చూపించి ఇప్పటికీ అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పురపాలక శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుంది.

పెరగనున్న ఆదాయం

భువన్‌ యాప్‌ ద్వారా వివరాలను నమోదు చేస్తుండటంతో పుర, నగరపాలికలో రెండింతలు ఆస్తిపన్ను పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్య అవసరాలకు సంబంధించిన భవనాల లెక్క తేలడంతో దాని ఆధారంగా పన్ను మదించే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆస్తిపన్ను పెంచకుండానే మదింపు పరిధిలోకి రాని భవనాలు గుర్తించి ఆదాయం పెంచుకోవాలని పురపాలక శాఖ భావిస్తోంది.

ఐదారు రోజుల్లో సర్వే ప్రారంభం

భువన్‌యాప్‌ ద్వారా ఆస్తిపన్ను మదింపు సర్వే ఐదారు రోజులలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన యాప్‌ ఆయా బిల్‌కలెక్టర్ల చరవాణిలకు డౌన్‌లోడ్‌ చేసే పని ప్రారంభించారు. బిల్‌ కలెక్టర్లకు కూడా శిక్షణ ఇప్పటికే పూర్తి చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో ఏకకాలంలో ఈ సర్వే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సర్వే రెండు నెలలు కొనసాగే అవకాశముందని రెవెన్యూ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రేషన్​ బియ్యానికి రెక్కలు... తనిఖీల్లో తరచూ పట్టివేతలు

ABOUT THE AUTHOR

...view details