కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నరీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఓటర్లను తమకు వీలైన రీతిలో ఆకట్టుకొనేందుకు యత్నిస్తున్నారు. కులవృత్తుల వారీగా.. స్త్రీ, పురుషుల వారీగా.. చిరువ్యాపారుల వారీగా తమవైపు తిప్పుకొనేందుకు యత్నిస్తున్నాయి. మరోవైపు పురుష, మహిళా ఓటర్లను తమకు అనుకూలంగా మారేలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అభ్యర్ధులు రోడ్‌షోలు, సమావేశాలతో తలమునకలై ఉంటే.. వారి సహధర్మచారులు కూడా అదే స్థాయిలో ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకట్టుకొనే యత్నం చేస్తున్నారు.
రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుంది. ఆ క్రమంలో ప్రతి ఓటును తమకు వేయించుకొనేందుకు ప్రధాన పార్టీలు కృషి చేస్తున్నాయి. ప్రధానంగా ప్రచారంలో నువ్వానేనా అన్నట్లు దూసుకుపోతున్న భాజపా, తెరాస అభ్యర్ధులు తమతో పాటు.. వారి సతీమణులను కూడా రంగంలోకి దించారు. నియోజకవర్గంలో మొత్తం 2,36,282 మంది ఓటర్లు ఉంటే అందులో పురషుల కన్నా 1,156 మంది అధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో తమ భర్తలను ఎన్నికల్లో గెలిపించుకునేందుకు... తమవంతు బాధ్యత నెరవేర్చేందుకు నడుం బిగించారు. మహిళలను ఆక్టటుకోవడానికి ఏయే అంశాలను ప్రస్తావించాలో వాటినే వారి దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రస్తావించడమే కాకుండా.. అధికార పార్టీ మహిళల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందో వివరించే యత్నం చేస్తున్నారు. మరో రెండేళ్ల పాటు తెరాస ప్రభుత్వం ఉంటుంది కాబట్టి.. తెరాస అభ్యర్థిని గెలిపిస్తే ప్రయోజనాలు ఉంటాయని ప్రచారం చేస్తున్నారు.
జమ్మికుంట మండలంలోని విలాసాగర్, వెంకటేశ్వర్లపల్లి, పాపయ్యపల్లిలో ఈటల రాజేందర్ సతీమణి జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా మహిళలకు బొట్టు పెట్టి ఈటల రాజేందర్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. ఇంటింటా ప్రచారంతో పాటు బతుకమ్మలో పాల్గొని మహిళలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమకాలంలో ఈటల రాజేందర్ చేసిన పోరాటం గురించి వివరిస్తూనే... ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఎలాంటి అభివృద్ది చేశారో.. ఎలా ప్రజల మనిషిగా ఎదిగారో వివరిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని అధికార పార్టీ ఎలా మోసం చేస్తుందో వివరిస్తున్నారు. భర్తలు ఒకవైపు గ్రామాలు చుట్టి వస్తుంటే... భార్యామణులు మరోవైపు గ్రామ పర్యటనలు చేస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకొనేయత్నం చేస్తున్నారు.