హుజూరాబాద్ ఉప ఎన్నికల (huzurabad by poll) సందర్భంగా ఓటర్లందరికి వ్యాక్సినేషన్(vaccination in huzurabad) అందించేలా చూడాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా క్షేత్రస్థాయిలో జోరు పెరుగుతోంది. అక్టోబరు మొదటి వారంలోగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ఓటర్లకు టీకా మొదటి డోసు అందించేందుకు వేగం పెంచుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 80 శాతానికిపైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఐదు మండలాల పరిధిలో ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితా ప్రకారం మొత్తంగా 2,36,283 మంది ఓటర్లున్నారు. ఇందులో మొదటి డోసు టీకాను 1,90,825 మంది అందుకున్నారు. రెండో డోసు విషయానికి వస్తే 64,915 మంది పూర్తి చేసుకున్నారు. ఈ నెల 8 వరకు అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు గడువు ఉండటం, తర్వాత ప్రచారం ఉండటంతో ఈ వారం రోజుల వ్యవధిని అధికారులు సవాలుగా తీసుకోనున్నారు.
నూరుశాతం లక్ష్యాన్ని సాధిస్తాం
హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలు కరీంనగర్ జిల్లా పరిధిలో ఉండగా ఒక్క కమలాపూర్ మండలం హనుమకొండ జిల్లా పరిధిలో ఉంది. కరీంనగర్ జిల్లాలో నాలుగైదు రోజుల్లోనే శతశాతం లక్ష్యాన్ని తొలి టీకా విషయంలో చూపిస్తామని జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ చెప్పారు. జిల్లాలో 24,278 మందికి వ్యాక్సినేషన్ వేస్తే అనుకున్న లక్ష్యం పూర్తవనుంది. దీంతోపాటు కమలాపూర్ మండలంలో 21,180 మందికి వేస్తే 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరు టీకాను అందుకున్న రికార్డు హుజూరాబాద్ నియోజకవర్గ సొంతమవనుంది.