హుజూరాబాద్‌లో ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మర్రిపల్లిగూడెంలో తెరాస అభ్యర్థి తరఫున మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి ఓట్లు అభ్యర్థించారు. భాజపా ప్రభుత్వం సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదని హరీశ్‌రావు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు రుణాలు మాఫీ చేసి.... రైతుల మీద బందూకులు ఎక్కుపెడుతోందన్నారు. వ్యవసాయ చట్టం తెచ్చి మార్కెట్లు మూసేస్తామంటున్న పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఈటల రాజేందర్ చెప్పాలన్నారు.
దళితబంధుపై సీఎంకు చిత్తశుద్ధి లేదు..
ఎస్సీల మీద ముఖ్యమంత్రికి ప్రేమ ఉంటే ఇప్పటివరకు ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కనుగిలగిద్దలో ఎన్నికల ప్రచారం చేశారు. దళితబంధు అడ్డుకున్నానని కొందరు తన దిష్టిబొమ్మ దగ్ధం చేశారని... అసలు ఆ పథకం రావటానికి కారణం ఎవరో ప్రజలకు తెలుసన్నారు. 18ఏళ్ల జీవితంలో ఏనాడు ఎన్నికలకు నయాపైసా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. హుజూరాబాద్ ప్రజలను ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా లొంగరని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
నేటి నుంచి బండి ప్రచారం..
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో భాజపా దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రచారంలో అధికార పార్టీకి ధీటుగా దూసుకుపోతున్న కమలనాథులు నేటి నుంచి మరింత వేగం పెంచాలని నిర్ణయించారు. భాజపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల తరఫున ఇవాల్టి నుంచి మూడ్రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, వివేక్, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం ఈటల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రజల పక్షాన పోరాడతా..
నియోజకవర్గంలోని పెద్దపాపయ్యపల్లి, చిన్నపాపయ్యపల్లి, ధర్మరాజుపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారం చేపట్టారు. ఇందులో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. భాజపా తెరాస మధ్య విమర్శలు చూస్తుంటే ఎవరెక్కువ దోచుకున్నారన్నఅంశంపై గొడవ పడుతున్నట్లుందని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజపల్లి ,శాలపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన బల్మూరి వెంకట్.... ప్రజల పక్షాన నిరంతరం పోరాడతానని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
ఉప ఎన్నిక సమీపిస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తూ... ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి.. శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా.. ఉండేందుకు అన్ని రకాల అస్త్రాలు ఉపయోగిస్తున్నారు.
ఇదీ చూడండి: