కరీంనగర్ జిల్లాలో ఓ పంచాయతీ పాలకవర్గం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు కరోనా టీకా తీసుకోని వారిని గుర్తించి.. ఇంటి వద్దకే వెళ్లి టీకా వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై విస్తృత అవగాహన కల్పించి వంద శాతం కరోనా వాక్సినేషన్ గ్రామంగా రికార్డు సృష్టించింది.
కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న దుర్శేడు గ్రామంలో కొంతమందికి వ్యాక్సిన్ అంటే భయం మాత్రం పోలేదు. దీనిపై గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు దృష్టిసారించారు. ఇప్పటికే పలుమార్లు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినా.. వందశాతం పూర్తికాలేదు. ఎలాగైనా గ్రామంలో వంద శాతం టీకా తీసుకొనే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇంటి వద్దకే వ్యాక్సిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందుకోసం తొలుత గ్రామంలో... ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేసుకోని వారి వివరాలను తీసుకున్నారు. వారికి వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించారు. ఇలా సుమారు 3000 వేల మంది ఉన్నట్లు గుర్తించి.. వారి ఇళ్లకు సమీపంలోనే వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటుచేసేలా చొరవ తీసుకున్నారు. డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో... వారందరికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు.