కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని సీతారాంపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ కూల్చివేశాడంటూ పోలీస్ కేసు నమోదవటం చర్చనీయాంశంగా మారింది. సీతారాంపూర్ పరిధిలో కొట్టె సంతోశ్.. ముగ్గురు సోదరులకు సంబంధించి 3 ఇళ్ల కోసం నగరపాలక సంస్థ అనుమతి తీసుకొని నిర్మాణం చేస్తున్నాడు. అయినా రాత్రికి రాత్రి జేసీబీలతో ఆ నిర్మాణాలను కూల్చివేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ గ్రామం నగరపాలక సంస్థలో విలీనం కాకముందు పంచాయతీగా ఉండగా.. అప్పట్లో సర్పంచ్ తీరుతో అనుమతి రాలేదు. నగరపాలికలో విలీనం తర్వాత అనుమతులు పొందినా.. అప్పటి సర్పంచ్, ప్రస్తుత కార్పొరేటర్‌కు మింగుడుపడటం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న ఇంటిని అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేయించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
1992లో మేము ఈ భూమిని కొన్నాం. 2014లో ఇళ్లు కట్టుకుందామని అప్పటి సర్పంచ్ వద్దకు పర్మిషన్ కోసం వెళితే రూ.10 లక్షలని డిమాండ్ చేశాడు. తర్వాత మా ఊరు మున్సిపాలిటీలో కలిశాక అన్ని అనుమతులు తెచ్చుకుని ఇంటి నిర్మాణం ప్రారంభించాం. స్లాబ్ వేద్దామనుకున్న సమయంలో రాత్రికి రాత్రి జేసీబీలతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. మేము ఇళ్లు కట్టుకోవడం ప్రస్తుత కార్పొరేటర్‌కు, మాజీ సర్పంచ్‌కు ఇష్టం లేదు. - సంతోశ్, బాధితుడు