లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లకు డిమాండ్ పెరిగింది. సడలింపు సమయంలో హోటళ్ల వైపు చూడని జనం.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆన్‌లైన్ ఆర్డర్లపై ఆధారపడుతున్నారు. ఫలితంగా కరీంనగర్‌లోని హోటళ్లలో సాధారణ రోజులకంటే లాక్‌డౌన్ సమయంలో నాలుగింతలు గిరాకీ పెరిగింది. నగరంలో రోజు దాదాపు 400 మందికి పైగా జొమాటో, స్విగ్గీ యువకులు ఆన్‌లైన్ భోజనాల సరఫరా చేస్తున్నారు. సుమారు 70 హోటళ్లు, బేకరీలు ఆహారాన్ని సప్లై చేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కుటుంబంతో కలిసి హోటళ్లలోనే డిన్నర్‌కు వచ్చేవారు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. రెస్టారెంట్ ఆహారాన్ని తినాలనిపిస్తే ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. గతంలో రోజుకు 400వరకు ఆర్డర్లు వస్తే ప్రస్తుతం 1800 వరకు వస్తున్నాయని హోటళ్ల యజమానులు చెబుతున్నారు.
Online Food : లాక్డౌన్లో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లకు గిరాకీ - demand for online food orders
కరోనా కారణంగా అన్ని వ్యాపారాలు కుంటుపడినప్పటికీ.. ఆన్‌లైన్ ఆహార సరఫరా మాత్రం ముమ్మరంగా సాగుతోంది. లాక్‌డౌన్‌తో ఇంటి నుంచి బయటకు రాని ప్రజలు.. ఆన్‌లైన్ ఆర్డర్లపై ఆధారపడుతున్నారు. ఫలితంగా సాధారణ రోజులకంటే.. నాలుగింతలు డిమాండ్ పెరిగినట్లు హోటళ్ల యజమానులు చెబుతున్నారు. మరోవైపు ఉపాధి కోల్పోయిన యువతకు... డెలివరీ బాయ్స్ రూపంలో అవకాశం కలిసివస్తోంది.
లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన యువకులు అనేక మంది డెలివరీ బాయ్స్ అవతారమెత్తుతున్నారు. పాఠశాలలు బంద్ కావడంతో పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు సైతం ఇదే ఉపాధి మార్గంగా ఎన్నుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా ఆర్డర్లు వస్తున్నాయంటున్న డెలివరీ బాయ్స్.... అధికశాతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నవారే ఆర్డర్ చేస్తున్నారని చెబుతున్నారు. కొందరు కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డెలివరీ బాయ్స్ వాపోతున్నారు.
ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తమకు ఈ ఉద్యోగం ఆదుకుంటోందంటున్న డెలివరీ బాయ్స్... క్లిష్ట పరిస్థితుల్లో సేవలందిస్తున్న తమ కష్టానికి... తగిన గుర్తింపు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.