Dalitha bandhu: హుజూరాబాద్‌లో 14,400 మంది ఖాతాల్లో దళిత బంధు నిధులు - హుజూరాబాద్ దళిత బంధు
21:18 September 14
హుజూరాబాద్‌లో 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు నిధులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం (Dalitha bandhu) కింద నిధులు జమచేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే సర్వే పూర్తి కాగా వలస వెళ్లిన వారి కుటుంబాలు.. తొలిదశలో మిగిలి పోయిన వారి వివరాలను సేకరించే అంశంపై దృష్టిని సారించింది. మొత్తం 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమచేసింది. ఒక్కొక్కరి ఖాతాలో 10 లక్షల చొప్పున జమచేసింది.
మిగిలిపోయిన వారి గురించి రీసర్వే చేస్తున్న వారితో పాటు దళిత కుటుంబాలందరికీ దళిత బంధు (Dalitha bandhu) పథకం అమలవుతుందని అధికారులు భరోసా కల్పించారు. రీ సర్వేలో రేషన్ కార్డులేని వారి వివరాలు తీసుకోవాలని, వలస వెళ్లిన కుటుంబాల వివరాలు కూడా తీసుకోవాలని, వాటన్నిటినీ అప్లోడ్ చేయాలని అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశించారు. రీసర్వేలో భాగంగా బ్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లి గుర్తించిన కొత్త వారికి కూడా బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని సూచించారు.
ఖాతాలో డబ్బులు జమ కాగానే సెల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారం వస్తుందని, దీన్ని అధికారులు ధ్రువీకరించుకోవాలని ప్రభుత్వం సూచించింది. నియోజకవర్గంలో వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న 6,400 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి ప్రత్యమ్నాయ యునిట్లను ఎంపిక చేసుకోవాలని సూచించనున్నారు.