National Highway 563 Latest News :జాతీయ రహదారి ఎన్‌హెచ్– 563 (National Highway 563) పనుల్లో భాగంగా.. వరంగల్– కరీంనగర్ సెక్షన్‌లో భారీ చెట్ల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే దాదాపుగా దశాబ్దాల నాడు నాటిన వృక్షాలను కూకటివేళ్లతో సహా తొలగిస్తున్నారు. కరెంట్ రంపాలతో వందేళ్లనాటి చెట్లు సైతం క్షణాల్లో నేలకూలుతున్నాయి. రోడ్డు విస్తరణ కోసం వీటిని తొలగించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తొలగింపు కాంట్రాక్టు తీసుకున్న ఓ సంస్థ నరికివేత కార్యక్రమాన్ని వేగం చేసింది. దీంతో ఈ రహదారిపై ఎక్కడ చూసినా విరిగిన కొమ్మలు, నేలకూలిన వృక్షాలు, రంపపు పొట్టు, నరికిన మొద్దులు, కర్రదుంగలు దర్శనమిస్తున్నాయి.
New roads in Telangana :దాదాపు ఈ రహదారిలో (Warangal Karimnagar National Highway) 2,000లకు పైగా దశాబ్దాలనాటి చెట్లు కూల్చక తప్పని పరిస్థితులు ఏర్పడటంతో.. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్ 563 కోసం తాము కూలుస్తున్న ఈ చెట్ల స్థానంలో తిరిగి మొక్కలు నాటుతామని.. పూర్వం స్థాయిలో పచ్చదనాన్ని పునరుద్ధరిస్తామని జాతీయ రహదారి విభాగం అధికారులు తెలిపారు.
వందల ఏళ్ల చెట్లు తొలగించారు... మళ్లీ నాటారు.. ఎలాగంటే!
మరోవైపు మానకొండూరు నుంచి హనుమకొండ శివారులో ఉన్న పలవేల్పుల వరకు.. 68 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి నిర్వహణ బాధ్యతలను భోపాల్‌కు చెందిన సంస్థకు అప్పగించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తికాగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పనులు ప్రారంభించింది. జులై 20, 2025 లోపు పనులు పూర్తి చేసే విధంగా పనులు చేపడుతున్నారు.
భగీరథ పైప్‌లైన్ కోసం హరిత హారం చెట్లు తొలగించారు..
కరీంనగర్–జగిత్యాల హైవే రహదారి నిర్మాణం కోసం కూడా.. భూసేకరణ ప్రక్రియ, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఈ రహదారిలో 11 బ్రిడ్జిలు రూపుదిద్దుకోనున్నాయి. మొత్తం 68 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి నిర్మాణానికి.. గతేడాది దాదాపు రూ.1,491 కోట్లతో అంచనాలు రూపొందించారు. అయితే గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో రహదారుల నిర్మించిన క్రమంలో.. తొలగించిన చెట్ల స్థానంలో మొక్కలు నాటే కార్యక్రమం మాత్రం జరగలేదు. ప్రస్తుత పరిస్థితిలో ముందుగా మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.