crop damage: వర్షాలకు వరదలు పోటెత్తడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అమ్మగారిపల్లె, ఖాన్సాయిపేట గ్రామాల్లో పొలాల్లో మెకాళ్లోతు నీరు నిలిచింది. ఇటీవల వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 500 ఎకరాలు నీట మునిగాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వానలతో పాటు బ్యాక్ వాటర్ రైతులను నట్టేట ముంచింది. ప్రతి ఏటా అధికారులు పరిశీలించి వెళ్లటమే తప్ప తమకు న్యాయం చేయట్లేదని ఆరోపించారు. మునిగిపోయిన భూములను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ల వాగు చెరువు కట్ట తెగడంతో వందలాది ఎకరాలు నీటమునిగాయి. ఎటు చూసినా బండలతో, ఇసుక మేటలతో పొలాలు దర్శనమిస్తున్నాయి. రోళ్లవాగు ప్రాజెక్ట్ పనులు ఐదేళ్లైనా నత్తనడకన సాగడంతో కట్టతెగి వేల ఎకరాల పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులను తలపించాయి. పలు గ్రామాల్లో వందల ఎకరాలు నీట మునిగాయి. వరి, సోయా, పత్తి ఇతర పంటలకు భారీ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి నీట మునిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గోడు వెల్లబోసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. తగిన పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి జిల్లా పరకాలలో పలుచోట్ల పంట పొలాల్లో కొన్ని రోజులుగా ఉన్న నీటి నిల్వలతో పత్తిపంట పూర్తిగా దెబ్బతింది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న తమకు సర్కార్ చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.