ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అధికం కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కొవిడ్ కారణంగా చనిపోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి బంధువులు ఆసక్తి చూపడం లేదు. దీంతో పలు సందర్భాల్లో మున్సిపల్ సిబ్బంది ఆ మృతదేహాలను దహనం చేస్తున్నారు. మానేరు నదీతీరాన ఒకే చోట 18 మృతదేహాలకు చితిపేర్చి దహనం చేసిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. వరుసగా 18శవాలు కాల్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తుండగా.. కొన్ని మాత్రం ఇంకా కాలుతూనే ఉన్నాయి.
కరీంనగర్లో కరోనా కలవరం.. మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులు నిర్లక్ష్యం చేయడంతో మున్సిపల్ సిబ్బంది ఇష్టారీతిన దహనం చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు.. ఇక్కడ కనిపిస్తున్న మరణాలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు.
కరోనా మరణాల గుట్టు బయట పడకుండా ఉండేందుకు ఇలా దహనం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నగరపాలక సిబ్బంది మాత్రం ఒక మానేరు తీరాన ఉన్న శ్మశాన వాటికలోనే కాకుండా సప్తగిరి కాలనీలోనూ అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు చెప్పారు. మూడురోజుల క్రితం ఏడు మృతదేహాలకు వరుసగా రెండురోజులు అంత్యక్రియలు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. మరణాలకు సంబంధించిన లెక్కల్లో మాత్రం ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ సంఖ్యలకు తేడా ఉందన్న ప్రచారం కొనసాగుతోంది.
ఇదీ చదవండి: 'గర్భిణీలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి'