కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి పూర్తిగా చెడిపోయిందని తక్షణమే దానిని మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ... సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మానకొండూరు మండలం చెంజర్ల వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీనితో కొద్ది సేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. అనంతరం మానకొండూరు పోలీసులు సీపీఐ నేతలతో మాట్లాడి ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనాలను పంపించారు.
'15 రోజులే సమయమిస్తున్నాం... లేదంటే ఉద్ధృతమే'
సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల వద్ద రాస్తారోకో నిర్వహించారు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్లే రహదారి పూర్తిగా చెడిపోయిందని తక్షణమే దానిని మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.
పేరుకే హైవే రోడ్డు కరీంనగర్ నుంచి వరంగల్ వరకు ఎక్కడ చూసినా రోడ్డు గుంతలు గుంతలుగా ఉందని... నిత్యం వేలాదిమంది ప్రయాణించే రోడ్డు చెడిపోతే పట్టించుకునే నాథుడే కరవయ్యారని అన్నారు. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని విమర్శించారు. అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం పోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ మార్గంలో నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తున్నా... వారికి ఈ రోడ్డు దుస్థితి కనిపించడం లేదా? లేక ప్రజల కష్టాలతో మాకేం అవసరం అనుకుంటున్నారా? అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదిహేను రోజుల్లో కరీంనగర్ నుంచి హన్మకొండ వరకు ఉన్న రోడ్డు మరమ్మతు చేయాలని... లేనిపక్షంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.