కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విచ్చలవిడిగా తుపాకీ లైసెన్సులు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ప్రకటనపై సీపీ సత్యనారాయణ స్పందించారు. తుపాకుల కారణంగా తనకు కానీ.. తన కుటుంబానికి చెందిన వారికి కానీ ఒక్క రక్తపు బొట్టు కారినా పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఈటల చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన సీపీ.. నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే లైసెన్సులు ఉన్నాయని స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గిపోయాయని.. ఇక్కడ ఎవరూ తుపాకీ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు.
ఇటీవల ఇల్లందకుంట ఎంపీపీ భర్త వెంకటేశం నడుముకు పెట్టుకున్న తుపాకీ కనిపించడం వివాదాస్పదంగా మారింది. అయితే ఆ విషయం తన దృష్టికి వచ్చిందన్న సీపీ.. అతడిని పిలిపించి విచారించి హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఇక ముందు తుపాకీని ప్రదర్శిస్తే లైసెన్సు రద్దు చేస్తామని తెలిపారు. విచ్చలవిడిగా లైసెన్సులు ఇస్తున్నామని ప్రచారం చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు.