MLA Helps to Bridegroom in Karimnagar : సాధారణంగా పెళ్లికి ముందు కట్నం తక్కువ ఇచ్చారనో, కుటుంబ సమస్యల వల్లనో, ప్రేమ వ్యవహారాల కారణంగానో లగ్గానికి ముందు వివాహాలు ఆగిపోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అంతా ఓకే అనుకుని పెళ్లి ఏర్పాట్లు చేసుకొని కల్యాణ మండపంలో వివాహ వేడుకకు సిద్దమయ్యారు. తీరా తాళి కట్టే సమయానికి వరుడు పెట్టిన కండిషన్తో అంతా ఆశ్చర్యపోయారు. దానికి ఓకే చెబితేనే పుస్తె కడతానని భీష్మించుకుని కూర్చున్నాడు. ఎదురుగా కూర్చున్న పెళ్లి కుమార్తె కన్నీళ్లు పెట్టింది. అదే సమయానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పెళ్లి మధ్యలో అలా జరగడం చూసి చలించిపోయారు. వెంటనే వివాహం ఆగడానికి గల కారణాలు తెలుసుకొని కావాల్సిన సహాయం చేసి పెళ్లి జరిపించిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని అంబాల్‌పూర్ గ్రామ మాజీ సర్పంచి గాజుల లచ్చమ్మ-మల్లయ్య దంపతుల కుమార్తె అనూషకు సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంగాల వినయ్‌తో లాంఛనాలు, కానుకలు ఒప్పందం చేసుకొని పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. కట్నం కింద రూ.5 లక్షలతో పాటు బైక్ ఒప్పుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికీ అప్పోసప్పో చేసి పెళ్లికి ముందే రూ.5 లక్షలు ముట్ట జెప్పారు. తీరా శుక్రవారం కేశవపట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహ సమయంలో వరుడు వినయ్ ద్విచక్ర వాహనం కోసం వధువు తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. వాహనం ఇస్తేనే తాళి కడతానని భీష్మించుకొని కూర్చున్నాడు.