మార్చి 17: కరీంనగర్‌లో తొలి కరోనా కేసు నమోదైన రోజది. మరో వారంలోనే కేసుల సంఖ్య 14కు పెరిగింది. ఇందులో ఒక్కరోజే ఎనిమిది మందికి పాజిటివ్ అని తేలింది. నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంకా ఎన్ని పెరుగుతాయో.. కరీంనగర్ ఏమవుతుందోననే ఆందోళన రాష్ట్రంలో వ్యక్తమైంది.
ఏప్రిల్ 9: కొత్త కేసులు లేవు. పరీక్షల్లో నెగెటివ్ రాగా ఐసోలేషన్‌లో ఉన్న 119 మందిని ఇళ్లకు పంపించారు. హుజూరాబాద్‌లో 26 మందికి పరీక్షల్లో నెగెటివ్ రాగా వారిని స్వీయ క్వారంటైన్‌లో ఉండమని పంపించారు.
* జిల్లాలో మొత్తం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఇంకా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఇందులో దిల్లీ సభలకు వెళ్లి వచ్చిన వారు ముగ్గురు కాగా వారిలో ఒకరి నుంచి అతడి సోదరుడికి సోకింది. తక్కిన ముగ్గురు కరీంనగర్ వాసులు. ఇండోనేసియన్ల నుంచి వారికి సోకింది.
ప్రజల సహకారం.. అధికారుల చొరవ.. పక్కా ప్రణాళిక.. కట్టుదిట్టమైన చర్యలు.. సాంకేతికత.. ఇలా అన్నిరకాల అస్త్రశస్త్రాలతో కరోనాపై సాగించిన పోరులో కరీంనగర్ యంత్రాంగం చాలావరకు పైచేయి సాధించింది. మార్చి 14న ఇండోనేసియన్లు కరీంనగర్‌లో కాలు మోపింది మొదలు.. వారిని గుర్తించి ఆస్పత్రికి పంపించే వరకు వారు ఎక్కడ తిరిగారు..? ఎవరిని కలిశారనే కోణంలో ముందుగా అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. వారిని కలిశారని అనుమానమున్న 82 మందిని తొలుత మార్చి 17న ఐసోలేషన్ వార్డులకు తరలించారు. ముఖ్యంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా ప్రకటించారు. అన్నివైపులా దారుల్ని మూసి వేసి సుమారు 4 వేల కుటుంబాల వారిని ఇళ్లకే పరిమితం చేశారు. అక్కడకు ప్రజల రాకపోకల్ని నిలువరించారు.
36,074 ఇళ్లలోని వారికి వైద్య పరీక్షలు..
సుమారు 52గంటల పాటు ఇండోనేసియన్లు నగరంలో తిరగడం, పలువురిని కలవడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడంపై జిల్లా కలెక్టర్ శశాంక నేతృత్వంలోని యంత్రాంగం మొదట దృష్టి పెట్టింది. 150 ప్రత్యేక బృందాలు నగరంలో ప్రభావమున్న 36,074 ఇళ్లలోని 1,36,348 మంది ఆరోగ్య పరిస్థితిని గమనించాయి. జ్వరం, జలుబు ఇతర లక్షణాలున్న వారిని వైద్య సిబ్బంది గుర్తించి అవసరమైన మందులిచ్చి జాగ్రత్తలు చెప్పారు.
* నగరంతోపాటు జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన స్థానికులు 622 మందిని గుర్తించి వారికి హోమ్ క్వారంటైన్ స్టాంపులను వేసి వారి ఇళ్ల వద్ద ప్రత్యేకంగా సూచనలతో బోర్డును ఏర్పాటు చేశారు. వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసేలా ఇంటికి ఇద్దరు చొప్పున అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎంపీ బండి సంజయ్ అధికారులకు అనుక్షణం అప్రమత్తమయ్యేలా సూచనలు అందించారు.
జనతా కర్ఫ్యూ కంటే ముందే ఇక్కడ నిర్బంధ కర్ఫ్యూ