ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల నివేదికను సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం 54మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నారు. జిల్లాలో కేసుల సంఖ్య 2210కి చేరింది. ప్రభుత్వాసుపత్రిలో సాధారణ పడకల కొవిడ్ విభాగంలో 60మంది, ఆక్సిజన్ అందించే విభాగంలో 30మంది, వెంటిలేటర్ సౌకర్యం ఉన్న వార్డులో నలుగురు మొత్తం 98మంది చికిత్స పొందుతున్నట్లు అందులో వివరించారు.
సుడా ఛైర్మన్ పీఏ, కార్పొరేటర్‌కు కరోనా నిర్ధారణ
సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణారావు దగ్గర పని చేస్తున్న వ్యక్తిగత సహాయకుడితో పాటు ఇంట్లో పని మనిషికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఛైర్మన్ ధ్రువీకరించారు. కాగా నగరపాలక సంస్థలో పని చేసే ఒక ఒప్పంధ ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మరో ఇద్దరికి లక్షణాలు ఉన్నట్లు సమాచారం. నగరంలోని భాజపా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌కు కరోనా పాజిటివ్ రాగా హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. మానకొండూర్ మండలంలోని మండల స్థాయి ప్రజాప్రతినిధి సతీమణికి కూడా కరోనాతో బాధపడుతున్నట్లు తెలిసింది.
చుట్టుముడుతున్న కరోనా
జిల్లాలో కరోనా చుట్టుముడుతోంది. నగరంలోని 60డివిజన్లు ఉండగా ఇప్పటికే 48 ప్రధాన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి పురపాలికల పరిధిలో కూడా ఈ వ్యాధి సోకడంతో ఆయా ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. మిగిలిన అత్యధిక మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 20గ్రామాల్లో వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు.
కట్టడికి చర్యలు
కరోనా విస్తరించిన ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కట్టడికి చర్యలు ప్రారంభించారు. హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారి గృహాలను గుర్తించి చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. నగరపాలక సంస్థ సోమవారం నుంచి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టారు. కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల్లో నగరపాలిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హోంఐసోలేషన్ ఉన్న వారి ఇళ్ల ద్వారాలకు స్టిక్కర్లు అంటించారు. వారంతా ఏ తేదీ వరకు హోంక్వారంటైన్‌లో ఉండాలో స్పష్టంగా రాస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, నగరపాలక సిబ్బంది పర్యవేక్షణ చేసే సమయాల్లో అందులో తేదీ, సమయం, సంతకాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించి బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌తో పిచికారీ చేస్తున్నారు.
నగరపాలికలో భయం..భయం
నగరపాలక కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు భయం, భయంగా విధులకు హాజరవుతున్నారు. కంప్యూటర్ సెక్షన్‌లో పని చేసే ఒక ఒప్పంద ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయినట్లు కార్యాలయ వర్గాలు చెప్పాయి. మరో ఇద్దరికి లక్షణాలు ఉండటం, పలువురు జ్వరాల బారిన పడటంతో ఆందోళన ఎక్కువైంది. లక్షణాలున్న ఓ ఉద్యోగి ఒక రోజు విధులకు హాజరు కావడంతో ఒప్పంద ఉద్యోగులతో పాటు అనుమానాలు ఉన్న ఉద్యోగులు, అధికారులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కమిషనర్ పేర్కొన్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం కొందరు కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నట్లు తెలిసింది.
హుజూరాబాద్‌లో 26 మందికి...
హుజూరాబాద్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రికార్డు స్థాయిలో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 124 మంది ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయించుకోగా, 30 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో నలుగురు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వారుండగా, మిగిలిన 26 మంది హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. తుమ్మనపల్లిలో ముగ్గురు, రంగాపూర్‌లో ఒకరు, పెద్దపాపయ్యపల్లిలో ఇద్దరు, వెంకట్రావుపల్లిలో ఒకరితో పాటు హుజూరాబాద్ పట్టణానికి చెందిన 19 మందికి పాజిటివ్ వచ్చింది. వీరందరిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. కిట్‌లు అందజేసి రోజూ వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వైద్యులు చెబుతున్నారు. కేవలం ఏడు రోజుల్లోనే హుజూరాబాద్‌లో 139 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురు కరోనా బారిన పడుతున్నారు.
జమ్మికుంటలో తొమ్మిది మందికి ...
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో సోమవారం తొమ్మిది మందికి కరోనా నిర్ధరణ అయినట్లు వావిలాల పీహెచ్‌సీ వైద్యాధికారి రఘుపతి తెలిపారు. మున్సిపల్ పరిధిలోని హౌజింగ్ కాలనీలో ఒకరికి, గాయత్రి బ్యాంక్ సమీపంలో ఒకరికి, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో ముగ్గురికి, మోత్కులగూడెంలో ఒకరికి, ధర్మారంలో ఒకరికి, కొత్తపల్లిలో ఇద్దరికి, జమ్మికుంటలో మండలం, కోరపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు.
మండలంలోని తాడికల్, వంకాయగూడెం గ్రామాలలో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారి సయ్యద్ షాకీర్ అహ్మద్ తెలిపారు. వంకాయగూడెం గ్రామ అయ్యప్పకాలనీలో ఓ వ్యక్తితో పాటు తాడికల్‌లో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. తాడికల్ గ్రామానికి చెందిన యువకుడు బ్యాంకు ఉద్యోగానికి ఎంపికవగా సోమవారం కరోనా పరీక్ష చేసుకోగా పాజిటివ్ తేలింది.
ఇవీ చూడండి:గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్