ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన నాలుగైదు జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్‌కు వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్‌లో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోను వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా ఆసుపత్రితో పాటు రెండు వైద్య కళాశాలసు, 63 ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే పరిస్థితి తీవ్రంగా ఉంటేనే కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరగా.. మిగతా సందర్భాల్లో మాత్రం కేవలం మందుల దుకాణాల్లోనే ఔషధాలు కొనుగోలు చేసి బాధితులు వైద్యం పొందారు.
నల్లదందాకు అడ్డుకట్ట
నగరంలో దాదాపు 600కు పైగా ఔషధ దుకాణాలు ఉండగా కొనుగోళ్లు కూడా అదే స్థాయిలో జరిగాయి. ఎప్పుడూ ఊహించని రీతిలో మాస్కులు, వేపోరైజర్లు, ఆక్సీపల్స్‌మీటర్లతో పాటు ఔషధాలు విపరీతంగా అమ్ముడు పోయాయి. అనూహ్యరీతిలో ఔషధాల కొరత కూడా ఏర్పడిందని డ్రగ్గిస్టులు తెలిపారు. అయితే లైఫ్ సేవింగ్ డ్రగ్‌గా భావించిన రెమ్‌డెసివిర్ విషయంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా తనిఖీలు నిర్వహించారు.