నిన్న, మొన్నటి వరకు లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోగా ఈ నెల 7 నుంచి కొంతమేర సడలింపులు ఇవ్వడం వల్ల భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అనుమతుల కోసం దరఖాస్తు చేసి రోజులు గడిచినా ఇప్పటివరకు అనుమతులు రాకపోవడం వల్ల దరఖాస్తుదారులు నగరపాలిక, మున్సిపాలిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
అనుమతులు ఆలస్యం
శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ(సుడా) పరిధిలోకి కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ, 71 గ్రామాలు వచ్చాయి. వీటి పరిధిలో భవన నిర్మాణ అనుమతులు తీసుకోవాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నగర, మున్సిపాలిటీల పరిధిలోని దరఖాస్తుదారులు ఆయా మున్సిపాలిటీల్లోని లైసెన్స్ సర్వేయర్ల ద్వారా దరఖాస్తులు చేస్తుండగా ఈ దస్త్రాలన్నీ సుడా పరిధిలోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కొద్ది నెలలుగా సుడాలో పోస్టులు భర్తీ కాకపోవడం, ఇన్‌ఛార్జీలు ఇవ్వకపోవడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది.
21 రోజుల్లో దరఖాస్తుదారుడికి అనుమతులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదైతే చాలు 21 రోజుల్లో దరఖాస్తుదారుడికి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. కొద్దిరోజుల్లో బీ-పాస్ రానుంది. కరోనా కారణంగా రెండు నెలలు ఎలాంటి కార్యకలాపాలు సాగించకపోగా అంతకుముందు ఫీజు విధించిన దరఖాస్తులు కూడా ఇప్పటికీ పరిష్కరించలేదు. దస్త్రాలన్నీ పెండింగ్‌లో పడినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం సుడాలో ఏపీవో పోస్టు లేకపోవడం సమస్యగా మారింది.