భాజపా, తెరాసలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినందున హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election 2021)ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కార్యదర్శి (సంస్థాగత) వంశీచంద్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్‌లు గురువారం సాయంత్రం దిల్లీలోని ఈసీఐ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేను కలిసి వినతిపత్రం సమర్పించారు.
భాజపా, తెరాసలు ఈ ఎన్నిక (Huzurabad By Election 2021)ల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డాయని తెలిపారు. అవి ఓటుకు రూ.6 వేల నుంచి రూ.పది వేల వరకు పంచాయని వివరించారు. అక్రమాలను అరికట్టడంలో రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ విఫలమయ్యారని ఫిర్యాదు చేశారు. తెరాసకు ఓట్లు వేయాలని పోలీసులు బెదిరిస్తున్నారని వివరించారు. శశాంక్ గోయల్ సహా అధికారులందరినీ మార్చిన తర్వాతే ఉప ఎన్నిక నిర్వహించాలని కోరారు. హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election 2021) రాజకీయ వ్యభిచారంగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ కూడా గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని శశాంక్‌గోయల్‌ను కలిసి భాజపా, తెరాసల అక్రమాలపై ఫిర్యాదు చేశారు.
మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి
వరి సాగు విషయంలో మంత్రులు, కలెక్టర్ల వ్యాఖ్యలపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. వారు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. వరి కొనకపోతే మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలిపారు.