ఓ వైపు ప్రజల ప్రాణాలు బలిగొంటూ కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపై ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదన్నారు.
ప్రజారోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు : మేడిపల్లి సత్యం - కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం
రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం విఫలమయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. ఈ మేరకు చొప్పదండిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
మంత్రులు, ధనికులు కార్పోరేట్ ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం చేయించుకుంటుంటే.. సామాన్యులు చేతిలో డబ్బులు లేక.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు లేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది నియామకంపై రాష్ట్రప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేవలం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పరిస్థితి చక్కదిద్దినట్టు సంకేతాలివ్వటం సరికాదన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి కార్పొరేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి సామాన్యులకు చికిత్స అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఇదీ చూడండి:-'కరోనా వేళ ఎన్నికల నిర్వహణకు సూచనలు ఇవ్వండి'