ముఖ్యమంత్రికి, ఈటలకు ఉన్న తగాదాల వల్లే ఈటల రాజేందర్ రాజీనామా చేశారని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఆరోపించారు. ప్రజా సమస్యల కోసం పోరాడేందుకు రాజీనామా చేసుంటే తాను ఆయన వెంటే నడిచేవాడినని అన్నారు. జమ్మికుంట పురపాలిక పరిధిలోని ధర్మారం గ్రామంలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పువ్వు, కారు గుర్తులతో మరోసారి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని మండిపడ్డారు. ఓ విద్యార్థి నాయకునిగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరో నాలుగు తరాలు తిన్నా తరగని ఆస్తులున్న వారు ఒకవైపు.. మరో 40 ఏళ్లు పోరాడే నాయకుడు మరోవైపు ఉన్నారని బల్మూరి వెంకట్ అన్నారు. ఓటర్లే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఎన్నికలు ఉంటే తప్ప ముఖ్యమంత్రి బయటికి వచ్చే పరిస్థితి ఉండదని బల్మూరి వెంకట్ విమర్శించారు. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల చావులు తగ్గలేదని ఆరోపించారు. భాజపా వాళ్లకు ఓటు వేస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రచారంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణ రావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.