తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో యాసంగి సాగుపై సందిగ్ధం - కాళేశ్వరం జలాలు

కాళేశ్వరం జలాలతో ఆరేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెన్నుదున్నుగా ఉన్న గంగాధర, నారాయణపూర్ జలాశయాల పరిధిలో.. యాసంగిలో సాగు సందిగ్ధం నెలకొంది. వర్షాకాలంలో భారీ వరద నీటికి ఈ రెండు చెరువుల కట్టలు తెగిపోవడంతో... వాటికి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముంపు బాధితులు మాత్రం... చెరువు గండ్లు పూడ్చే ప్రసక్తే లేదంటూ భీష్మించుకూర్చోవడం... సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి

కరీంనగర్‌
కరీంనగర్‌

By

Published : Dec 1, 2022, 4:20 PM IST

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో యాసంగి సాగుపై సందిగ్ధం

కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఆయా గ్రామాల్లో దాదాపు లక్ష 65వేల ఎకరాలకు... గంగాధర, నారాయణపూర్‌ రెండు జలాశయాల ద్వారా ఎల్లంపల్లి నీటిని అందిస్తున్నారు. సకాలంలో చెరువుల మరమ్మతులు చేపట్టి నీరందించకపోతే మాత్రం ఇందులో సగం విస్తీర్ణంలో కూడా... పంట సాగు చేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం చెరువు నింపి అక్కడి నుంచి గంగాధర నారాయణపూర్ జలాశయాలకు రెండు పైప్ లైన్ల ద్వారా ఎత్తిపోస్తారు.

ఇక్కడి నుంచి చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని దాదాపు 60 చెరువులు కుంటలు నింపి కాలువల ద్వారా రెండు పంటలకు సాగునీటిని అందిస్తున్నారు. చెరువులు నింపడంతో సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు అందుబాటులో ఉండగా యాసంగిలో పంటలు పుష్కలంగా పండి రైతుల ఇళ్లల్లో సిరులు కురిపించాయి. వరి పంట కాలం 125 రోజుల నుంచి 140 రోజులు కాగా ఇప్పటినుంచే ఏప్రిల్ వరకు సాగునీరు అందించాలి. కానీ ఇంతవరకు మరమ్మతులే జరగలేదని రైతులు వాపోతున్నారు.

'నారాయణపూర్ రిజర్వాయర్ కింద పొలాలు సాగుచేసుకుంటున్నాం. తెగిపోయిన కట్ట పోయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. నీరు వస్తేనే నార్లు పోసే అవకాశం ఉంది. త్వరలో ప్రభుత్వం చర్యలు తీసుకొని చెరువు కట్ట పోయాలి. అధికారుల చొరవతో అప్పుడు గండి పెట్టారు. ఇప్పటికీ నాలుగైదు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. తక్షణమే అధికారులు చొరవ తీసుకుని రెండు చెరువుల కట్టలు పోయాలి. లెకపోతే రాబోయే రోజుల్లో సాగు, తాగునీరుకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.'-బాధిత రైతులు

గంగాధర, నారాయణపూర్ చెరువుల మరమ్మతులకు మొదట 20 లక్షల రూపాయలు మంజూరు కాగా అధికారులు యంత్రాలతో అక్కడికి వెళ్లారు. ముంపు గ్రామాల బాధితులు పనులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించారు. జనవరి నెలలోపు చెరువులకు మరమ్మతులు పూర్తి చేసి ఎల్లంపల్లి నీటిని ఫిబ్రవరిలో విడుదల చేస్తే తప్ప.. పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులంటున్నారు.

'అప్పుడు అధికారులు చొరవ తీసుకుని గండి పెట్టారు. ఇప్పుుడు దానిని పూడ్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలానే ఉంటే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. రెండు కట్టలు పూడ్చితేనే నీరు ఆగుతుంది. 10 గ్రామాల ప్రజలకు లాభం చేకూరుతుంది. రెండు మూడు నెలలు ఇలాగే కొనసాగితే త్రాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలి.'-బాధిత రైతులు

మరో వైపు ముంపు గ్రామాలైన నారాయణపూర్, మంగపేట, చర్లపల్లి ఎన్ గ్రామాల్లో సమస్యలు తీర్చాకే చెరువుల మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఊర్లు విడిచి పక్క గ్రామాల్లో తలదాచుకున్నామని వాపోతున్నారు. కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన చేసినా తమ గ్రామాలకు అధికారులు ప్రజాప్రతినిధులు రాలేదని.. భరోసా కల్పించలేదని అంటున్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం నుంచి 16 కోట్ల 50 లక్షల పరిహారం అందాల్సి ఉంది. పరిహారం అందిన తర్వాతనే పనులు చేపట్టాలని.. ముంపు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details