కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ సభలో రసాభాస చోటుచేసుకుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరడంతో ప్రజాప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయి తమ తమ బలాలను నిరూపించుకునే ప్రయత్నాల్లో పడిపోయారు. ఒక వైపు అధికార పార్టీ ఈటల మద్దతుదారులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. మరో వైపు ఈటల రాజేందర్ తన సత్తా చాటుకునేందుకు యత్నిస్తున్నారు. ఇల్లందకుంటలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ ఈ వివాదానికి కారణమైంది. 189 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టగా.. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జడ్పీ ఛైర్పర్సన్ కనుమల్ల విజయ హాజరయ్యారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో తెరాస, ఈటల వర్గాల మధ్య రసాభాస - trs and eetala rajender groups fighting in illandakunta
తెరాస నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ వైదొలగొడం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆయన భాజపాలో చేరడంతో స్థానికంగా వివాదాలు మొదలయ్యాయి. ప్రజాప్రతినిధులు రెండు గ్రూపులుగా విడిపోయాయి. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సైతం ఇరు వర్గాల మధ్య సయోధ్య లేకపోవడంతో ఆందోళనలకు దారితీస్తోంది. ఇల్లందకుంటలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ వివాదానికి కారణమైంది.
జడ్పీ ఛైర్పర్సన్ అధ్యక్షతన కార్యక్రమం చేపట్టడంతో ఈటల వర్గానికి చెందిన ఇల్లందకుంట ఎంపీపీ పావని అభ్యంతరం చెప్పారు. జడ్పీ ఛైర్పర్సన్ ఎలా అధ్యక్షత వహిస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అధికారులు కలుగజేసుకొని నచ్చజెప్పారు. మరో వైపు ప్రజలు తమకు రాజకీయాలు కాదు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుల పాలైన వారికి చెక్కులిచ్చి ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఆర్డీవో కలుగజేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది. ఆయన సమక్షంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పూర్తి చేశారు.
ఇదీ చదవండి:Murder: ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డి హత్య