తెలంగాణ

telangana

ETV Bharat / state

పలుచోట్ల దయనీయంగా యాసంగి పంటల పరిస్థితి - telangana varthalu

కరీంనగర్‌ జిల్లాలో పలుచోట్ల యాసంగి రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం కల్పించిన ఆశతో వేసుకున్న పంటకు తీరా నీరందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. వరి గింజ పొట్టపోసుకొనే దశలో పంట ఉండటంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నాడు. చేసేదేమిలేక బోరుబావులు తవ్విస్తూ ఆర్థికంగా చితికోపోయే పరిస్థితి నెలకొంది.

yasangi crops
దయనీయంగా యాసంగి పంటల పరిస్థితి

By

Published : Mar 27, 2021, 4:48 AM IST

పలుచోట్ల దయనీయంగా యాసంగి పంటల పరిస్థితి

భూగర్భజలాలు అడుగంటిపోయాయి. బోరు బావులు ఎండిపోయాయి. వరి పొలాలు బీడుబారుతున్నాయి. ఎండుతున్న పంటలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కంటతడి పెడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని పలుమండలాల్లోని అన్నదాతలకు ఈ యాసంగి పంట నష్టాల పాలుచేస్తోంది. వర్షాలు బాగా కురవడం వల్ల రైతులు పెద్ద ఎత్తున వరిసాగుచేసినా... కాల్వ ద్వారా నీరందడం లేదని లబోదిబోమంటున్నారు. పంట చేతికి అందివచ్చే దశలో ఎండవేడిమి పెరుగుతుండటంతో పంటలు ఎండిపోతున్నాయి.

వందల ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు

జిల్లాలోని గంగాధర, పిట్టలపల్లి, పందికుంటపల్లి, పత్తికుంటపల్లి, నేలకొండపల్లి, మంగపేట, శానగర్‌, లక్ష్మిపూర్, శ్రీరాములపల్లి, రాంచంద్రాపురం, చిప్పకుర్తి, దత్తోజిపేట, వెంకటరావుపల్లి, రుద్రారం, కోరుట్లపల్లి, దేశరాజుపల్లి, వెదిర గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఒక్కో రైతుకు 10నుంచి 15 ఎకరాల వరకు వరి పంట వేసుకొనే అవకాశం ఉన్నా.... నీరు అందుతుందో... లేదో.... అన్న అనుమానంతో చాలా వరకు పంటను తగ్గించి వేసుకున్నారు. అయినా సాగుచేసిన కాస్తంత పంటలు సైతం ఎండిపోతున్నాయని వాపోతున్నారు.

అన్నదాతల ఆందోళన

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపురం చెరువుకు నీరువస్తున్నా... అక్కడి నుంచి ఈ గ్రామాలకు నీరు అందటంలేదు. నారాయణపూర్‌ కుడి కాల్వ పనుల్లో నిర్లక్ష్యంతో చివరి ఆయకట్టుదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. దీపం కిందనే చీకట్లు తారట్లాడిన చందంగా తమ పరిస్థితి మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు చేసేదిలేక లక్షల రూపాయలు ఖర్చు చేసి... బోరుబావులు తవ్వించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవటంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పంట ఎండిపోయి పెట్టుబడైనా రాని పరిస్థితుల్లో.... బోర్లు వేసేందుకు చేసే ఖర్చుతో మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

నీరందించండి..

ఎన్నోఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న నారాయణపూర్‌ కుడికాల్వ పనులను వెంటనే చేపట్టి తమప్రాంతాలకు నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంలో అదే వైఫల్యం

ABOUT THE AUTHOR

...view details