CM KCR at Choppadandi Praja Ashirvada Sabha :రైతుల కష్టాలు తీరేలా ఒక ప్రణాళిక రూపొందించామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసింగించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొండగట్టు గతం ఎలా ఉండేదని.. ఇప్పుడు అక్కడ దివ్యధామంగా తీర్చిదిద్దుతామని వివరించారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కొండగట్టును అభివృద్ధి చేస్తామని హమీనిచ్చారు. కొండగట్టు అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామనిసీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు నీటి కోసం ఎన్నో బోర్లు వేసేవాళ్లమన్నారు. సాగునీటి పన్నులు రద్దు చేశామని, ధాన్యమంతా కొంటున్నామని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసుకున్నామని వివరించారు. రైతుబంధు వృథా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని ధ్వజమెత్తారు. రైతు భూమిపై ఎమ్మార్వోలు, తహశీల్దార్ల పెత్తనం వస్తుందని ఆరోపించారు. ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు పెరుగుతాయని విమర్శించారు. రాబోయే రోజుల్లో 24 గంటలు మంచినీళ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హమీనిచ్చారు.
2024 తర్వాత కేంద్రంలో బీఆర్‌ఎస్ కీలకం కానుంది : కేసీఆర్
'రైతుబంధు వేస్ట్ అనే పార్టీ కావాలా? ఇచ్చే పార్టీ కావాలా? రవిశంకర్‌ను గెలిపిస్తే రైతు బంధు 16 వేలకు తీసుకుపోతాం. గ్రామాలలో మరో డేంజర్.. ధరణిని తీసేస్తరట. తీసేస్తే మీ భూములకు రక్షణ ఉండదు. మరో పథకం తెస్తామని మళ్లీ మేనిఫెస్టోలో చెప్పారు. భూ భారతి తెస్తారట. అది పాతదే. 30 ఏళ్ల కిందనే తెస్తే దాంతోటి ఏమీ కాలేదు. ధరణి ఉంటేనే రైతు బంధు వస్తుంది. తీసేస్తే ఏ పద్ధతిలో ఆ డబ్బులొస్తాయి. మళ్లీ పైరవీకారుల రాజ్యమొస్తుంది. రైతులకు మేలు చేసేటోడు కావాలా? కిందిమీద చేసేటోడు కావాలా?. కర్ణాటకలో 20 గంటల కరెంటు ఇస్తామని అన్నారు. ఇప్పుడు 5 గంటలు కూడా ఇస్తలేరు.' -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి